రికవరీ ఇంకెప్పుడు?.. మహిళా గ్రూపు సభ్యులకు బ్యాంకర్ల నోటీసులు

రికవరీ ఇంకెప్పుడు?.. మహిళా గ్రూపు సభ్యులకు బ్యాంకర్ల నోటీసులు
  • గజ్వేల్ మెప్మాలో గందరగోళం
  • ఆందోళనకు సిద్దమవుతున్న మహిళలు

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: గజ్వేల్ మున్సిపాలిటీలోని మెప్మా విభాగంలో రూ.1.33 కోట్ల మేర అవకతవకలు జరిగినట్టు నిర్థారించినా అధికారులు రికవరీపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. 8 మహిళా గ్రూపుల్లో 80 మంది సభ్యులుండగా వారికి తెలియకుండా కొంతమంది వారి పేర్లపై  బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ అవినీతి వెలుగులోకి రాగా ముగ్గురిపై చర్యలు తీసుకుని అధికారులు చేతులు దులుపుకున్నారు. 

మరోవైపు గ్రూపు సభ్యులకు బ్యాంకు, కోర్టు నుంచి నోటీసులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. మొదట రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం రుణాల గోల్ మాల్ కు కారకులైన వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని నిర్ణయించినప్పటికీ దీనిపై ఎలాంటి ప్రగతి లేదు. 

గ్రూపు సభ్యులకు లీగల్ నోటీసులు

రుణాల గోల్ మాల్ జరిగిన 8 మహిళా గ్రూపుల్లో మొత్తం 80 మంది సభ్యులుంటే వారిలో50 మందికి ఇప్పటికే బ్యాంకుల నుంచి లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. రెండు రోజుల కింద విచారణ జరగని మరో 3 గ్రూపులకు సంబంధించి 30 మందికి నోటీసులు అందాయి. తమ పేరిట రుణాలు తీసుకున్నారని నోటీసులు అందుకున్న తర్వాతనే తెలిసిందని బాధిత మహిళలు వాపోతున్నారు. 

ముందస్తు ప్లాన్ తోనే..

గజ్వేల్ మెప్మా విభాగంలో పనిచేసే వారే ముందస్తు ప్లాన్ తో 8 మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి భారీ స్కామ్ కు పాల్పడ్డారు. గ్రూపులను ఏర్పాటు చేసే సమయంలోనే ఒక్కో  గ్రూపులో ఆరుగురు ఫేక్ సభ్యుల పేర్లను  నమోదు చేయించారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని ఎంపిక చేసి గ్రూపుల్లో సభ్యులుగా చేర్చారు. కొందరిని రెండు గ్రూపుల్లో నమోదు చేసి వారి పేరిట రుణాలు పొందారు. నిబంధనల ప్రకారం ఒకే ప్రాంతానికి చెందిన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయాల్సి ఉన్నా ముందస్తు  ప్లాన్ ప్రకారం దీన్ని  తుంగలో తొక్కారు. సభ్యులతో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని సమావేశాలు నిర్వహించినట్టుగా రికార్డుల్లో నమోదు చేసి రుణాలు మంజూరు చేసే సమయంలో ఒకరికి ఒకరు ఎదురు పడకుండా డబ్బులను పక్కదారి పట్టించారు.

విచారణ పేరిట కాలయాపన

ప్రత్యేక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపి ప్రాథమిక నివేదికను సమర్పించినా బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. బ్యాంకు అధికారులు, మెప్మా సిబ్బంది నిబంధనలు అతిక్రమించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు కానీ తమకు నోటీసులు జారీ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మెప్మా సిబ్బందిని నమ్మి సంతకాలు చేస్తే తమ పేరిట రుణాలు తీసుకుని వాడుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయం మున్సిపల్ అధికారులకు తెలిసినా డబ్బుల రికవరీని పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 

అవకతవకలపై పోలీసులకు ఫిర్యాదు చేసాం

గజ్వేల్ మున్సిపాలిటీ మెప్మా విభాగంలో మహిళా గ్రూపుల రుణాల అవకతవకలపై కలెక్టర్ ఆదేశాల ప్రకారం పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రత్యేక కమిటీ నిర్వహించిన విచారణలో రూ.1.33 కోట్ల రుణాలు పక్కదారి పట్టినట్టుగా నిర్థారించాం. అవకతవకలకు పాల్పడిన ఉద్యోగుల నుంచి ఆర్ఆర్  యాక్ట్ ప్రకారం రెవెన్యూ అధికారులు డబ్బులు రికవరీ చేస్తారు.
బాలకృష్ణ, కమిషనర్,  గజ్వేల్  మున్సిపాలిటీ

తెల్లకాగితంపై సంతకాలు తీసుకున్నరు

తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని మోసం చేసిండ్రు. ఎలాంటి పరిచయం లేకున్నా గ్రూపులో సభ్యులుగా చేర్పించి గ్రూపు పేరిట రూ.4 లక్షల లోన్ తీసుకున్నరు. నేను నయా పైసా బ్యాంకు నుంచి తీసుకోకున్నా కోర్టు, బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినయ్​. ఇప్పటికైనా అసలు దొంగలను పట్టుకొని డబ్బులు రికవరీ చేయాలి
స్వాతి, బాధితురాలు, శివశంకరి గ్రూపు

న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యం

ఉపాధి చూపిస్తామని మహిళా గ్రూపులో చేర్పించి మోసం చేసిండ్రు. గ్రూపు పేరిట లోన్ తీసుకుంటున్న విషయం చెప్పలేదు. బ్యాంకు నుంచి రుణం మంజూరైన తర్వాత నాకు డబ్బులు ఇవ్వలేదు. ఇప్పుడు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చినయ్​. ఒంటరి మహిళనైన నేను ఇద్దరు పిల్లలను అతి కష్టం మీర పోషించుకుంటున్న. ఈ విషయంలో నాకు న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యం.సంధ్య, బాధితురాలు, లీలస్వీ గ్రూపు