గజ్వేల్, వెలుగు: గోడలపై ఫొటోలు తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లో ఉన్న కేసీఆర్‌ను ఎవరూ దూరం చేయలేరని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో బీఆర్ఎస్ నేత ఒంటెరు ప్రతాప్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. అధికార దాహంతో ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని కాంగ్రెస్ లీడర్లపై మండిపడ్డారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు తాళాలు పగలగొట్టడం, ఫొటోలు తొలగించడం వంటి చర్యల వల్ల పెద్ద నాయకులు కాలేరని, మీకు నిజంగా ధైర్యముంటే, కేసీఆర్ చేసిన అభివృద్ధి కంటే మిన్నగా చేసి చూపాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు గుండాయిజం చేస్తుంటే పోలీసులు వేడుక చూస్తున్నారని ఆరోపించారు. ‘ప్రభుత్వ ఆఫీసుల్లో సీఎం ఫొటోనే ఉండాలని ఏదైనా జీవో ఉందా? మీ మంత్రుల ఆఫీసుల్లో ప్రధాని ఫొటోలు పెట్టుకుంటున్నారా?’ అని ప్రశ్నించారు.
