ట్రిపుల్ఆర్ రైల్వేలైన్ వస్తే గజ్వేల్ కీలకం

ట్రిపుల్ఆర్  రైల్వేలైన్ వస్తే  గజ్వేల్ కీలకం
  •     ట్రిపులార్​కు ఆనుకుని రైల్వే లైన్​ నిర్మాణం
  •     ఉత్తర, దక్షిణ భాగాలను కలపడంలో ప్రధాన పాత్ర
  •     ఇప్పటికే స్టేషన్ లో ఎరువుల రేక్ పాయింట్ ఏర్పాటు

సిద్దిపేట, వెలుగు: హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డుకు  సమాంతరంగా రైల్వే లైన్ ను నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో భవిష్యత్ లో సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. ట్రిపులార్ చుట్టూ రైల్వే లైన్ నిర్మాణానికి అడుగులు పడుతుండడంతో హైదరాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్ రైల్వే స్టేషన్ ప్రత్యామ్నయంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే ట్రిపులార్ అలైన్​మెంట్ ఖరారు కావడంతో దానిని అనుకుని రైల్వే లైన్ నిర్మిస్తుండడంతో  సిద్దిపేట జిల్లా అభివృద్ధికి అవకాశం ఏర్పడనుంది. 

ట్రిపులార్ ఉత్తర, దక్షిణ భాగాలను కలపడంలో కూడా గజ్వేల్ రైల్వే స్టేషన్ కీలకంగా మారనుంది. రింగ్ రైల్ లో భాగంగా గజ్వేల్, జగదేవ్ పూర్, ములుగు మండలాల్లో రైల్వే లైన్ విస్తరించే అవకాశాలున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి రింగ్ రైల్ నిర్మాణంపై  కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో చర్చించగా ఆయన  సానుకూలంగా  స్పందించారు. 

సరుకు రవాణా సులభతరం

ట్రిపులార్ కు సమీపంలోనే గజ్వేల్ రైల్వే స్టేషన్ ఉండడంతో సరకు రవాణా సులభతరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని మనోహరాబాద్ మండలంలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఉండడంతో ఇక్కడి ఎగుమతులు, దిగుమతులకు గజ్వేల్ రైల్వే స్టేషన్ చాలా ఉపయోగపడనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పటాన్ చెరు, నర్సాపూర్ లోని పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాకు గజ్వేల్ రైల్వే స్టేషన్  కీలకంగా మారనుంది.

 గజ్వేల్ రైల్వే స్టేషన్ లో నాలుగేండ్ల కింద ఎరువుల రేక్ పాయింట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ట్రిపులార్ కు సమీపంలోని గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా  రాష్ట్రంలో 8 జిల్లాలకు ఎరువుల సరఫరా కోసం ప్రత్యేకంగా గోడౌన్లు నిర్మించి స్టాక్ ను నిల్వ చేస్తున్నారు. మనోహరాబాద్ కొత్త పల్లి రైల్వే లైన్  నిర్మాణంలో భాగంగా గజ్వేల్ స్టేషన్ వద్ద రేక్ పాయింట్ ఏర్పాటు చేసి ఎరువుల దిగుమతి కోసం ప్రత్యేకంగా లైన్లను ఏర్పాటు చేశారు. గజ్వేల్ రేక్ పాయింట్ కు తమిళనాడులోని కరిగెకళ్, ఏపీలోని వైజాగ్, కాకినాడ పోర్టుల నుంచి నేరుగా ఎరువులు వస్తున్నాయి. భవిష్యత్​లో రింగ్ రైల్ ఏర్పడితే  వివిధ అవసరాలకు గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్ర బిందువుగా మారనుంది. 

జిల్లా అభివృద్ధికి బాటలు

రింగ్ రైల్ నిర్మాణం వల్ల సిద్దిపేట జిల్లా మరింత అభివృద్ధి చెందనుంది. సికింద్రాబాద్​నుంచి మెదక్ జిల్లాలోని మనోహరాబాద్ మీదుగా  సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇటీవల సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు వరకు రైల్వే లైన్ పనులు పూర్తి కాగా ట్రయల్ రన్ ను నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ప్రవేశంలోనే గజ్వేల్ రైల్వే స్టేషన్ ఉండడంతో భవిష్యత్​లో ప్రయాణికులతో పాటు సరుకు రవాణాలో కీలకం కానున్నది. ఇప్పటికే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్​కు ఉదయం, మధ్యాహ్నం ప్యాసింజర్ ట్రైన్ నడుస్తోంది.