గల్వాన్ ఘర్షణలు దురదృష్టకరం: చైనా అంబాసిడర్ వీడోంగ్

గల్వాన్ ఘర్షణలు దురదృష్టకరం: చైనా అంబాసిడర్ వీడోంగ్

న్యూఢిల్లీ: ఇండో–చైనా సైనికుల మధ్య గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలు దురదృష్టకరమైనవిగా భారత్‌లో చైనా అంబాసిడర్ సున్ వీడోంగ్‌ చెప్పారు. ఆ ఘటనలో 20 మంది ఇండియా జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గల్వాన్ ఘర్షణలపై వీడోంగ్ స్పందించారు. అదో దురదృష్టకర ప్రమాదం అని పేర్కొన్నారు. చరిత్ర దృక్కోణం నుంచి చూస్తే అది సంక్షిప్త క్షణమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘‘కొంత కాలం క్రితమే బార్డర్‌‌లో ఒక దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. ఇండియా లేదా చైనా ఎవరూ దీన్ని కోరుకోలేదు. ఇప్పుడు దీన్ని సరిగ్గా నిర్వహించడంపై మేం పని చేస్తున్నాం. హిస్టారికల్‌గా చూసుకుంటే ఇవి సంక్షిప్త క్షణాలనే చెప్పాలి. ఇండో–చైనాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు 70 ఏళ్ల కింద మొదలయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలు అడ్డంకులను తట్టుకొని మరింత బలోపేతం అయ్యాయి. ఈ కొత్త శతాబ్దిలో వీటికి ఒకేసారి అడ్డంకులు రాకూడదు. ద్వైపాక్షిక సంబంధాలు వెనుకంజ వేయడానికి బదులుగా మరింత ముందుకు దూసుకెళ్లాలి. ఇండియాను చైనా ఒక శత్రువులా కాకుండా మిత్రుడిలా చూస్తోంది. ముప్పుగా కాకుండా అవకాశంగా భావిస్తోంది. దైపాక్షిక సంబంధాల బలోపేతానికి మనం పలు ప్రశ్నలు వేసుకోవాల్సి ఉంటుంది. విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. తద్వారా అతి త్వరలో దైపాక్షిక సంబంధాలను పున:స్థితికి తీసుకురావాలి’ అని వీడోంగ్ వివరించారు.