కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం.!

కల్నల్ సంతోష్ బాబుకు అరుదైన గౌరవం.!

గ‌త ఏడాది భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల్లో అమరుడైన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం ప్రతిష్ఠాత్మక మహావీర చక్ర అవార్డును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. గల్వాన్ వ్యాలీలో చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన కల్న‌ల్‌ సంతోష్ బాబుకు కేంద్రం ఈ పురస్కారాన్ని ఇవ్వ‌నుంది. రేపు దేశ రాజధానిలో నిర్వహించే వేడుకల సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ఈ అవార్డును అందజేస్తారని సమాచారం. తెలంగాణ వాసి అయిన కల్నల్ సంతోష్ బాబు సరిహద్దులో చైనా సేనల దురాక్రమణను అడ్డుకోవడంలో జూన్ 15 వ తేదిన వీరోచితంగా పోరాడి మరణించిన సంగతి విదితమే. కాగా.. కల్నల్ సంతోష్ బాబుకు రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పుర‌స్కారాలలో భాగంగా మ‌హా వీర చక్ర పురస్కారాన్ని కేంద్రం ప్రకటించనుంది.

మిలటరీ అవార్డుల్లో అత్యుత్తమైన పురస్కారం పరమవీర్ చక్ర. ఆ తరువాత మహవీర్ చక్ర, వీర్ చక్ర, అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర పతాకాలను అత్యుత్తమ గ్యాలంట్రీ అవార్డులను భావిస్తారు. దేశ రక్షణకు సంబంధించిన అలాంటి రెండో అత్యుత్తమ పురస్కారం మహవీర చక్ర ను ఈ ఏడాది కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం ప్రధానం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం.