
- ఇక్కడి నుంచే సర్కార్ దవాఖానల బ్రాండింగ్ పనులు ప్రారంభం
- శానిటేషన్ నుంచి పేషెంట్ కేర్ దాకా సమూల మార్పులు
- ఇదే మోడల్లో మిగతా హాస్పిటల్స్ కూ కార్పొరేట్ లుక్
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖానలకు కార్పొరేట్ లుక్ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ దవాఖానాలకు బ్రాండింగ్ తీసుకురావాలని నిర్ణయించిన సర్కారు.. తాజాగా గాంధీ దవాఖానను బ్రాండింగ్కు రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు నిర్ణయం తీసుకుంది. దవాఖానలకు బ్రాండింగ్ తీసుకొచ్చే పనులకు గాంధీ నుంచే ప్రారంభించనున్నారు. శానిటేషన్ మొదలు పేషెంట్ కేర్ వరకు సమూల మార్పులు తీసుకురానున్నారు. పేషెంట్ దవాఖానలోకి అడుగుపెట్టినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ప్రతి డిపార్ట్‌మెంట్‌లో ఆధునిక సౌలతులను కల్పించనున్నారు.
రిసెప్షన్, ఓపీ కౌంటర్ సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేయనున్నారు. స్పష్టమైన సైన్‌బోర్డులు, సౌకర్యమైన కుర్చీలు, డిజిటల్ టికెట్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. సిబ్బందికి వారి హోదా ఆధారంగా ప్రత్యేక రంగులతో యూనిఫామ్‌లు అందిస్తారు. అలాగే దవాఖాన గోడలు, వార్డులు, కారిడార్‌లకు మనశ్శాంతిని ఇచ్చే రంగులను ఎంపిక చేయనున్నారు. పిల్లల వార్డుల్లో రంగురంగుల డిజైన్‌లు, పెద్దల వార్డుల్లో లైట్ రంగులతో పెయింటింగ్ వేయనున్నారు. దవాఖాన సిబ్బంది పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా వ్యవహరించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. బెడ్‌ల మధ్య ఖాళీని పెంచి, రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించనున్నారు. డిశ్చార్జ్ తర్వాత సేవలపై రోగుల అభిప్రాయాలను ఫోన్ కాల్స్ ద్వారా సేకరించి, సేవలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోనున్నారు.
202 హాస్పిటల్స్ కు బ్రాండింగ్..
మొదటి దశలో 202 ఆసుపత్రులకు బ్రాండింగ్ తీసుకువారావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రాండింగ్కు ఎంపికైన దవాఖానల్లో జిల్లా, ప్రాంతీయ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు ఉన్నాయి. ఈ హాస్పిటల్స్ లో చెత్తాచెదారం లేకుండా ఆవరణలో చెట్లు, పూల మొక్కలు, కూర్చునే స్థలాలతో ల్యాండ్‌స్కేపింగ్ చేయనున్నారు. పార్కింగ్ సమస్యలను తీర్చేందుకు రోగులు, సందర్శకులు, సిబ్బందికి వేర్వేరు జోన్‌లు, స్పష్టమైన సైన్ బోర్డులు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. బ్రాండింగ్ వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఈ దవాఖానల రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయి. మొదటి దశ విజయవంతమైతే, మిగిలిన ఆసుపత్రులను కూడా రెట్టించిన ఉత్సాహంతో బ్రాండింగ్ చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.