
పద్మారావునగర్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో చిన్నగా పీపుల్స్ మెడికల్ కాలేజీగా మొదలైన.. గాంధీ మెడికల్ కాలేజీ ఇయ్యాల్టితో 71 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు దేశ, విదేశాల్లో నిష్ణాతులైన వేలాది మంది డాక్టర్లను తయారు చేసి.. వైద్యరంగంలో అగ్రగామిగా నిలిచింది. డాక్టర్లను తయారు చేసే కర్మాగారంగా పిలిచే గాంధీ మెడికల్ కాలేజీకి దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1954 సెప్టెంబర్14న అన్వర్ ఉలామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 40 మంది విద్యార్థులతో పీపుల్స్ మెడికల్ కాలేజీ ప్రారంభమైంది.
1955 జూన్ 25న హుమాయూన్ నగర్‌లో కొత్త భవనాన్ని అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ ప్రారంభించారు. 1958 జులైలో బషీర్‌బాగ్‌కు తరలించి గాంధీ మెడికల్ కాలేజీగా పేరు మార్చారు. 2003లో సికింద్రాబాద్‌లో ఉన్న ప్రస్తుత ఆధునిక భవన సముదాయంలో అందుబాటులోకి వచ్చింది. 1950-–60 మధ్యలో గాంధీ దవాఖానకు మెడికల్ కాలేజీకి అనుబంధమైంది. ఇప్పుడు విశాలమైన స్థలంలో గాంధీ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఒకే ప్రాంగణంలో కొనసాగుతున్నాయి.
అలుమ్నీ సేవలు
గాంధీ మెడికల్ కాలేజీ పూర్వవిద్యార్థుల సంఘం ఏటా ప్రతిభావంతులైన విద్యార్థులను గోల్డ్ మెడల్స్, ప్రోత్సాహక బహుమతులతో సత్కరిస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నది. పేద విద్యార్థులను ఎంపిక చేసి స్కాలర్ షిప్‌లు అందిస్తుంది. అలాగే వైద్య పరికరాలను, ముఖ్యంగా కొవిడ్సమయంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించింది. నేడు (ఈ నెల14న) గాంధీ మెడికల్ కాలేజీ ఆవరణలోని అలుమ్నీ భవనంలో 71వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
ఈ కార్యక్రమానికి నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, డీఎంఈ నరేందర్‌కుమార్, గాంధీ కళాశాల ప్రిన్సిపాల్ కే. ఇందిర, సూపరింటెండెంట్ ఎన్. వాణి, టీజీఎస్ఎమ్సీ చైర్మన్ డా..కే.మహేశ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు అలుమ్నీ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జీఆర్ లింగమూర్తి, కార్యదర్శి వెంకటరత్నం తెలిపారు. ఈ సందర్బంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పీజీ, సూపర్ స్పెషాలిటీ, యూజీ వైద్య విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను అందజేస్తామన్నారు.