
- 7 వేల విగ్రహాల కొనుగోళ్లకు రూ.16 కోట్లు
- అన్న ప్రసాదాలకు రూ.8 కోట్లు కిరాణం, వెజిటేబుల్, స్వీట్ షాపుల్లో సందడి
- కూలీలకు ఉపాధి కల్పించిన వినాయకుడు
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో గణేశ్ఉత్సవాలు చాలా ఖరీదైన వేడుకగా జరిగింది. భక్తులు పోటాపోటీగా నిర్వహిస్తున్న ఈ వేడుక రూ.వంద కోట్లకు మించి టర్నోవర్ సాధించింది. వినాయక విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వరకు నిర్వాహకులు ఖర్చుకు వెనుకాడడం లేదు. ఇరవై ఏండ్ల క్రితం ఊరు మొత్తానికి కలిపి ఒకటి, రెండు ఉండేవి. పట్టణాల్లో అయితే గరిష్ఠంగా పది విగ్రహాలు దాటపోయేవి. వీటి సంఖ్య ఇప్పుడు ఏకంగా 7 వేలకు చేరాయి. గణేశ్ నవరాత్రి ఉత్సవాలతో పేదలకు ఉపాధి లభిస్తుంది.
డెకరేషన్ ఖర్చు..
గణేశుడికిపూజా సామగ్రి ఖర్చుగా రూ.500 లెక్కించినా దాని విలువ రూ.20 కోట్లకు చేరుకుంటుంది.మండపాల నిర్మాణం కోసం రూ.12 వేలు లెక్కించినా 7 వేల మండపాల ఖర్చు రూ.8.40 కోట్లు అవుతుంది. తడుకలు, బొంగులు, ఇనుప రేకులు ఇలా స్తోమతను బట్టి ఎవరికి వారు మండపాలు నిర్మించారు. డెకరేషన్ కోసం రూ.40 లక్షలకు మించి వెచ్చించారు. నిమజ్జనం ముగిసేదాకా సౌండ్ సిస్టం అరెంజ్మెంట్కు ఒక్కొక్కరూ ఖర్చు చేసిన రూ.5 వేలు లెక్కిస్తే రూ.35 లక్షలు పెట్టారు.
కార్మికులకు ఉపాధి...
టెంట్ హౌస్ మొదలుకొని, బొంగులు అమ్మే కార్మికులకు గణేశ్ ఉత్సవాలు ఉపాధి చూపాయి. వెజిటెబుల్ మార్కెట్, కిరాణా షాప్‌ల్లో సరుకుల కొనుగోళ్లు పెరిగాయి. ఇదే అదునుగా వ్యాపారులు రేట్లు కూడా పెంచేశారు. ఒక్కో మండపంలో అన్నప్రసాదం ఖర్చు కింద ఏవరేజ్‌గా రూ.15 వేల ఖర్చు అవుతుందని భావించిన 5,700 మండపాల్లో రూ.8 కోట్లకు మించి ఖర్చుపెట్టారు. మండపాల్లో ఏర్పాటు చేసిన లడ్డూ బరువు ఎక్కడా 3 కిలోలకు తక్కువ లేదు. ఈ లెక్కన రూ.70 లక్షలుస్వీట్స్ కోసం ఖర్చు పెట్టారు. వేలంలో ఒక్కో లడ్డూ కనీసం రూ.10 వేలు పాడినా మండపాలకు రూ.6 కోట్ల భారీ ఇన్కమ్ సమకూరనుంది.
ఏటా పెరుగుతున్న మండపాలు..
జిల్లాలో ఏటా వినాయకుడి మండపాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది 5,700 ఉన్న మండపాలు ఉండగా, ఈసారి 7 వేలకు చేరాయి. కనీసం రూ.7 వేలకు తగ్గకుండా ఒక్కో విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ఏవరేజ్‌గా రూ.30 వేల నుంచి రూ.40 వేలు, కొందరు రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షలతో గణపతిని కొనుగోలు చేశారు. 4.88 లక్షల ఇండ్లున్న జిల్లాలో 70 శాతం మంది చిన్ని వినాయకుడిని ప్రతిష్టించుకున్నారు. ఈ రకంగా ఒక్కొక్కరూ కనీసం రూ.200 ఖర్చుతో విగ్రహాలు కొనుగోలు చేసినా దాని విలువ సుమారు రూ.6 కోట్లు అవుతుంది. మండపాల వినాయకులను కలిపితే మొత్తానికి రూ.16 కోట్ల కేవలం విగ్రహాలు కొనుగోలుకు పెట్టినట్లు తెలుస్తుంది.