టమాటా లారీ హైజాక్.. పోలీసుల సెర్చ్ ఆపరేషన్

టమాటా లారీ హైజాక్.. పోలీసుల సెర్చ్ ఆపరేషన్

షాకింగ్.. వెరీ వెరీ షాకింగ్.. టమాటాలతో వెళుతున్న లారీని హైజాక్ చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 2023, జులై 11వ తేదీన పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

కర్నాటక రాష్ట్రానికి చెందిన మల్లేష్ అనే రైతు.. తన పొలంలో పండిన టమాటా సరుకును అమ్ముకోవటానికి లారీలో కోలార్ మార్కెట్ కు వెళుతున్నారు. బెంగళూరు నుంచి కోలార్ రహదారిలో.. టమాటా లారీ.. ముందుకు వెళుతున్న కారును ఢీకొంది. ఈ యాక్సిడెంట్ లో కారు అద్దాలు పగిలిపోయాయి. పొరపాటున జరిగిందని ఒప్పించే ప్రయత్నం చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని కారులోని ముగ్గురు వ్యక్తులు డిమాండ్ చేశారు. డబ్బులు లేవని రైతుతోపాటు లారీ డ్రైవర్ వేడుకున్నారు. 

ఇదే సమయంలో లారీలో ఏముంది అంటూ ప్రశ్నించారు కారులోని ముగ్గురు వ్యక్తులు. టమాటా ఉందని.. కోలార్ మార్కెట్ లో అమ్మకానికి వెళుతున్నట్లు చెప్పారు రైతు మలేష్.. దీంతో కారులోని ముగ్గురు వ్యక్తులు.. అప్పటికప్పుడు మాస్టర్ ప్లాన్ వేశారు. లారీ డ్రైవర్, రైతును పక్కకు నెట్టేసి.. కారులోని ఇద్దరు వ్యక్తులు లారీని తీసుకుని వెళ్లిపోయారు. మరో వ్యక్తి తన కారును తీసుకుని వెళ్లిపోయారు. 

దీంతో రైతు, లారీ డ్రైవర్ ఇద్దరు పోలీసుకు కంప్లయింట్ చేశారు. టమాటా లారీ కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. లారీలో రెండున్నర టన్నుల టమాటా ఉందని.. దాని విలువ మూడు లక్షల రూపాయలు అని వెల్లడించారు పోలీసులు. వాస్తవంగా అయితే కారుకు అయిన డ్యామేజీ 10 నుంచి 15 వేల రూపాయలు మాత్రమే ఉండొచ్చని చెబుతున్నారు లారీ డ్రైవర్. ఇప్పుడు 3 లక్షల రూపాయల టమాటాతోపాటు.. లారీ సైతం హైజాక్ అయ్యిందని.. ఎక్కడ ఉందో వెతుకుతున్నామని.. త్వరలోనే లారీతోపాటు టామాటా సరుకును కూడా పట్టుకుంటామని చెబుతున్నారు పోలీసులు. 

టమాటా లారీ హైజాక్ విషయంలో కర్నాటక రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.