ప్లానింగ్లో పుష్పరాజ్ను మించిపోయారు.. డీసీఎంలో పైన కొబ్బరి బోండాలు.. లోపల గంజాయి ప్యాకెట్లు..!

ప్లానింగ్లో పుష్పరాజ్ను మించిపోయారు.. డీసీఎంలో పైన కొబ్బరి బోండాలు.. లోపల గంజాయి ప్యాకెట్లు..!

హైదరాబాద్: డీసీఎంలో కొబ్బరి బోండాల చాటున డ్రగ్స్ తరలిస్తున్న ముఠా బాగోతం బట్టబయలైంది. పెద్ద అంబర్ పేట్లో ఈగల్ టీమ్, రాచకొండ, ఖమ్మం పోలీసులు కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా ఈ తనిఖీల్లో షాకింగ్ విషయం బయటపడింది. డీసీఎం వాహనం తనిఖీ చెయ్యగా 2 కోట్ల విలువైన 401కేజీల గాంజా పట్టుబడింది. నిందితులు రాజస్తాన్కు చెందిన చోటు నరాయమ లాల్ నాయక్, రాజ్ నాయక్, కిషన్ లాల్ నాయక్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు.

డీసీఎం వాహనం, కారులో కొబ్బరి బోండాల మాటున గంజాయి దాచి ఏపీ నుంచి రాజస్తాన్కు తరలిస్తున్న క్రమంలో నిందితులు దొరికిపోయారు. నిందితులపై ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదు చేశారు. ఇలానే డ్రగ్స్ తరలిస్తున్న మరో ముఠాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీఎం వ్యాన్లో సిమెంట్ బ్యాగుల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ సెల్లో రూ.6.25 కోట్ల విలువైన 1,210 కేజీల గంజాయిని దాచి రవాణ చేస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్, మహేశ్వరం ఎస్వోటీ పోలీసులు కలిసి పట్టుకున్నారు. గంజాయిని ఒడిశా నుంచి రాజస్థాన్కు తరలిస్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.

రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన విక్రమ్ అలియస్ వికాస్ (22) డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రాజస్థాన్కు చెందిన దేవిలాల్, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్ స్థానికంగా గంజాయి సప్లై నెట్​వర్క్​ను నడిపిస్తున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్కు గంజాయి తీసుకొస్తే ట్రక్కు లోడ్ కు రూ.5 లక్షలు ఇస్తామని విక్రమ్ కు చెప్పారు. అందుకు ఒప్పుకున్న విక్రమ్.. రాజస్థాన్ నుంచి ఐరన్ లోడ్తో మహారాష్ట్ర నాందేడ్కు వెళ్లాడు. అక్కడ ఐరన్ అన్​లోడ్ చేసి హైదరాబాద్ మీదుగా ఖమ్మం చేరుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఖమ్మంలో సిమెంట్ బస్తాలు నింపుకుని ఒడిశాలోని మల్కన్ గిరి వెళ్లాడు. అక్కడ 1,210 కిలోల గంజాయి కొని సిమెంట్ బస్తాల కింద ఏర్పాటు చేసుకున్న సీక్రెట్ సెల్లో దాచాడు.

హైదరాబాద్ మీదుగా రాజస్థాన్​కు బయల్దేరాడు. పక్కా సమాచారంతో మంగళవారం ఉదయం విజయవాడ నేషనల్ హైవేపై కొత్తగూడెం చౌరస్తాలో పోలీసులు ఆ డీసీఎంను అడ్డగించారు. వెహికల్ను తనిఖీ చేయగా.. సిమెంట్ సంచుల మధ్యలో 70 బ్యాగుల్లో 1,210 కేజీల గంజాయిని గుర్తించారు. విక్రమ్ను విచారించగా రాజస్థాన్కు చెందిన దేవిలాల్, ఆయుబ్ ఖాన్, రామ్ లాల్కు గంజాయి డెలివరీ ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పాడు.