హైదరాబాద్ చందానగర్లో.. పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా అరెస్ట్.. ఆరుగురు పిల్లలు సేఫ్

హైదరాబాద్ చందానగర్లో.. పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠా అరెస్ట్.. ఆరుగురు పిల్లలు సేఫ్

హైదరాబాద్: సైబరాబాద్‌ పరిధిలో చందానగర్ పోలీసులు పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ గ్యాంగ్ సైబరాబాద్ పరిధిలో, సంగారెడ్డి జిల్లాలో చిన్నారులను కిడ్నాప్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 2025, ఆగస్టు 26న లింగంపల్లి పోచమ్మగుడి సమీపంలో నాలుగేళ్ల అఖిల్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. 

తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, కిడ్నాప్ గ్యాంగ్ బయటపడింది. ప్రధాన నిందితుడు చిలుకూరి రాజుతో పాటు.. ఈ ముఠాలోని మోహద్ ఆసిఫ్, మిస్ రిజ్వానా, నర్సింహరెడ్డి, బాలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి రూ.5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో మియాపూర్ డివిజన్‌ ఏసీపీ, చందానగర్ ఎస్‌హెచ్‌ఓ బృందం, డీసీపీ మాదాపూర్ జోన్ పర్యవేక్షణలో పోలీసులు పనిచేశారు.

నిందితుల వివరాలు:
* చిలుకూరి రాజు: పటాన్‌చెరు, ఆయుర్వేద వైద్యుడు. నాలుగేళ్ల క్రితం కాచిగూడ నుంచి ఒక శిశువును కిడ్నాప్ చేసి రూ.42 వేలకు విక్రయించాడు. అప్పటి నుంచి ఇలాంటి పనులే చేస్తున్నాడు.
* మహమ్మద్ ఆసిఫ్: కూరగాయల వ్యాపారి. బాలింతలైన తల్లిదండ్రులకు కిడ్నాప్ చేసిన పిల్లలను సరఫరా చేసేవాడు.
* మిస్ రిజ్వానా: సిద్దిపేటకు చెందిన నర్సింగ్ క్లినిక్ నిర్వహణలో ఉన్న ఆమె, తల్లిదండ్రులు అడిగిన పిల్లలను సదరు గ్యాంగ్ ద్వారా కొనుగోలు చేసేది.
* నర్సింహరెడ్డి: రాజు స్నేహితుడు. అఖిల్ కిడ్నాప్‌లో సహకరించాడు.
* బలరాజు: గ్యాంగ్‌కు సాయం చేశాడు.

రక్షించబడిన పిల్లలు:
1. అఖిల్ (5 సంవత్సరాలు)
2. ఆరుష్ (2 సంవత్సరాలు)
3. అయూబ్ (5 సంవత్సరాలు)
4. లాయిబా (5 సంవత్సరాలు)
5. అస్యా (5 సంవత్సరాలు)
6. ప్రియ (1 సంవత్సరం)

మొత్తం ఆరుగురు పిల్లలను పోలీసులు రక్షించి, జిల్లా బాలల సంరక్షణాధికారికి అప్పగించారు.