హోండురాస్‌‌‌‌‌‌‌‌లో గ్యాంగ్ వార్.. 25 మంది మృతి

హోండురాస్‌‌‌‌‌‌‌‌లో గ్యాంగ్ వార్.. 25 మంది మృతి

హోండురాస్‌‌‌‌‌‌‌‌: ముఠా హింసను అణచివేయడానికి హోండురాస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నప్పటికీ గురువారం జరిగిన దాడుల్లో ఆరుగురు పోలీసులతో సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ ఉత్తర భాగంలోని ట్రుజిల్లో మున్సిపాలిటీలో గల ఓ వ్యవసాయ క్షేత్రంపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడుల్లో 19 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మృతదేహాలన్నీ తోటలో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 

మరోవైపు గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలోని ఒమోవా మున్సిపాలిటీలో ముఠా కార్యకలాపాలను అణచివేయడానికి వెళ్లిన పోలీసులపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఈ అంబుష్‌‌‌‌‌‌‌‌లో ఆరుగురు పోలీసు అధికారులు మరణించారు. ఈ రెండు దాడుల నేపథ్యంలో జాతీయ పోలీసు విభాగం స్పందించింది. బాధ్యులను పట్టుకోవడానికి, బలహీన వర్గాల ప్రజలను రక్షించడానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది.