రాహుల్‌‌పై దాడి ప్రజాస్వామ్యం మీద గ్యాంగ్ రేప్ లాంటిదే

రాహుల్‌‌పై దాడి ప్రజాస్వామ్యం మీద గ్యాంగ్ రేప్ లాంటిదే

ముంబై: హత్రాస్ బాధితురాలి కుటుంబీకులను కలవడానికి వెళ్లిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో అక్కడ జరిగిన తోపులాటలో రాహుల్ కింద పడ్డారు. తనను పోలీసులు నెట్టివేశారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై శివ సేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. రాహుల్‌‌ గాంధీతో ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు వ్యవహరించిన తీరును రౌత్ ఖండించారు. యూపీ పోలీసుల తీరును దేశ ప్రజాస్వామ్యంపై చేసిన గ్యాంగ్ రేప్‌‌గా అభివర్ణించారు. ‘రాహుల్ గాంధీ ఓ జాతీయ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్‌‌తో విభేదాలు ఉన్నప్పటికీ ఆయనతో పోలీసులు వ్యవహరించిన తీరును ఎవ్వరూ సమ్మతించరు. రాహుల్ కాలర్‌‌ పట్టుకొని, ఆయనను నేల మీదకు నెట్టేశారు’ అని రౌత్ మండిపడ్డారు.