
పూణేకు చెందిన గ్యాంగ్‌స్టర్ శరద్ మోహల్ దారుణ హత్యకు గురయ్యారు. సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. 40 సంవత్సరాల వయస్సు గల మోహోల్‌పై నలుగురు దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఒక బుల్లెట్ అతని ఛాతీని తాకగా, మరోకటి అతని కుడి భుజానికి తగిలింది. దీంతో మోహోల్ కింద పడిపోయాడు.
వెంటనే అతన్ని చికిత్స కోసం కోత్రుడ్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్థారించారు. కాల్పులకు సంబంధించి ఎనిమిది మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మూడు పిస్టల్స్, మూడు మ్యాగజైన్లు, ఐదు రౌండ్లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌లో తలెత్తిన భూమి, డబ్బుకు సంబంధించిన వివాదమే హత్యకు కారణమని తెలుస్తోంది.
శరద్ మోహోల్ చాలా క్రిమినల్ కేసులున్నాయి. అతను గతంలో ఎరవాడ జైలులో అనుమానిత ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్త మహ్మద్ ఖతీల్ సిద్ధిఖీని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడుతూ మొహోల్‌ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదన్నారు.