అది.. మాకు పవిత్ర గ్రంథంతో సమానం: మంత్రి గంగుల

అది.. మాకు పవిత్ర గ్రంథంతో సమానం: మంత్రి గంగుల

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన  బి ఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ లో 2023, అక్టోబర్ 17వ తేదీ మంగళవారం మీడియా సమావేశంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. 2018 ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు పన్నారని ఈటెల రాజేందర్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.  ఈటెలది దుర్మార్గాపు ఆలోచన అని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన బిఫామ్ మాకు పవిత్ర గ్రంథంతో సమానమని,  కెసిఆర్ ఫోటోతో గెలిచి... ఏళ్ళ తరబడి పదవులు అనుభవించిన ఈటెల... ఇప్పుడు కెసిఆర్ పై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యపట్టారు. రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ ఫోటో లేకుండా గెలువగలవా అని ఈటలను మంత్రి గంగుల ప్రశ్నించారు.  ఉద్యమాలకు పెట్టింది పేరు ఈ గడ్డ అని, స్వరాష్ట్ర సాధన కోసం సింహ గర్జనతో సమరశంఖాన్ని పూరించింది ఇక్కడి నుండేనని అన్నారు. 

రేపు కరీంనగర్ లో ఉదయం 10 గంటలకు బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ ఉంటుందని,  ఈ సభలో మంత్రి కేటిఆర్ కూడా పాల్గొంటున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున సభలో పాల్గొని ఆశీర్వదించాలని మంత్రి కోరారు. నా చేతులు బలోపేతం చేయండి... మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు.  విలువైన ఓటును వృధా చేయొద్దని.. అభివృద్ధికి పట్టం కట్టండని పిలుపునిచ్చారు. స్వలాభం కోసం,  స్వార్థం కోసం పోటీ చేసేవారిని ఆదరించొద్దని తెలిపారు. బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని, 9వ తేదీన తొలి నామినేషన్... 10వ తేదీన 2వ నామినేషన్ దాఖలు చేస్తానని మంత్రి తెలిపారు. బొమ్మకల్ హనుమాన్ టెంపుల్ నుండి ప్రచారం ప్రారంభిస్తానని ఆయన చెప్పారు.  మీ నమ్మకాన్ని వమ్ము చేయననని..  వేరే పార్టీకి ఓటు వేస్తే వృధా అవుతుందని...తనకే ఓటి వేసి గెలిపించాలన్నారు.