క్యాబ్‌‌‌‌‌‌‌‌బాస్‌గా దాదా రీఎంట్రీ.. బెంగాల్ క్రికెట్ ప్రెసిడెంట్‌‎గా మరోసారి గంగూలీ

క్యాబ్‌‌‌‌‌‌‌‌బాస్‌గా దాదా రీఎంట్రీ.. బెంగాల్ క్రికెట్ ప్రెసిడెంట్‌‎గా మరోసారి గంగూలీ

కోల్‌‌‌‌‌‌‌‌కతా: టీమిండియా మాజీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సౌరవ్ గంగూలీ మళ్లీ క్రికెట్ పరిపాలనలోకి వస్తున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్‌‌‌‌‌‌‌‌) ప్రెసిడెంట్ రెండోసారి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం జరిగే క్యాబ్‌‌‌‌‌‌‌‌వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం) దాదా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లాంఛనమే కానుంది. గంగూలీతో పాటు తన ప్యానెల్‌‌‌‌‌‌‌‌మెంబర్స్‌‌‌‌‌‌‌‌బబ్లు కోలే (సెక్రటరీ), మదన్ మోహన్ ఘోష్ (జాయింట్ సెక్రటరీ), సంజయ్ దాస్ (ట్రెజరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), అనూ దత్తా ( వైస్ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌) కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. 

లోధా కమిటీ సిఫార్సుల ప్రకారం కార్యవర్గ పదవుల్లో ఆరేండ్ల పరిమితి నిబంధన కారణంగా, తన అన్న స్నేహశిష్ గంగూలీ స్థానంలో 53 ఏండ్ల సౌరవ్ గంగూలీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే క్యాబ్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‎గా గంగూలీ రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌సవాళ్లు విసరనుంది. ఇటీవల కాలంలో  ఆర్థిక అవకతవకలు,  ఇతర ఆరోపణలతో దెబ్బతిన్న క్యాబ్‌‎ను తిరిగి గాడిలో పెట్టాల్సిన బాధ్యత దాదా తీసుకోవాల్సి ఉంది. 

గత కొంతకాలంగా క్యాబ్‌‌‌‌‌‌‌‌ పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. రంజీ ట్రోఫీలో బెంగాల్ టీమ్ ఆట కూడా పేలవంగా ఉంది.  వీటితో పాటు  క్యాబ్ ప్రెసిడెంట్‌‌‌‎గా బాధ్యతలు స్వీకరించగానే గంగూలీ ముందు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. నవంబర్ 14 నుంచి ఈడెన్ గార్డెన్స్‌‎లో జరగనున్న ఇండియా–సౌతాఫ్రికా తొలి టెస్టును విజయవంతంగా నిర్వహించడం అందులో ప్రధానమైనది. 2019లో చారిత్రాత్మక పింక్-బాల్ టెస్టు తర్వాత ఈడెన్‌‎లో జరగనున్న తొలి టెస్టు ఇదే కావడం విశేషం.

ఆ పింక్-బాల్ టెస్టును బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌గా గంగూలీనే ముందుండి నడిపించాడు. ఇక, డిసెంబర్ 26 నుంచి జనవరి 25 వరకు సౌతాఫ్రికాలో జరగనున్న ఎస్‌‌‌‌‌‌‌‌ఏ 20 లీగ్ నాలుగో ఎడిషన్‌‎లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టుకు హెడ్ కోచ్‌‎గా దాదా అపాయింట్ అయ్యాడు. అటు హెడ్ కోచ్,  ఇటు క్యాబ్‌‌‌‌‌ప్రెసిడెంట్‌‎గా రెండు పాత్రలను గంగూలీ ఎలా సమన్వయం చేసుకుంటాడన్నది ఆసక్తికరంగా మారింది.