
ముంబై: ప్రతీ టెస్ట్ సిరీస్‌లో కనీసం ఒక్క పింక్ బాల్ మ్యాచ్ ఉంటేనే లాంగ్ ఫార్మాట్ సజీవంగా ఉంటుందని బీసీసీఐ బాస్ గంగూలీ అన్నాడు. ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ డే అండ్ నైట్ ఫార్మాట్‌లో జరగనుంది. లక్షా పది వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న అహ్మదాబాద్ మొతెరా స్టేడియంలో ఈనెల 24వ తేదీన ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టేడియం కెపాసిటీలో 50 శాతం మందికి ఎంట్రీ కల్పించనున్నారు. అయితే, పింక్ బాల్ మ్యాచ్ టికెట్లన్నీ ఆల్రెడీ అమ్ముడైపోయానని ఓ ఇంటర్వ్యూలో దాదా తెలిపాడు.‘మొతెరా స్టేడియం టికెట్లన్నీ ఇప్పటికే సేల్ అయిపోయాయి. అక్కడ జరగబోయే రెండు టెస్ట్‌ల గురించి జైషాతో మాట్లాడా. వాళ్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఆరేడేళ్ల బ్రేక్ తర్వాత అహ్మదాబాద్‌లో ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగనుండటం కూడా వారి ఆసక్తికి కారణం. కోల్‌కతాలో పింక్‌బాల్ టెస్ట్ నిర్వహించి మేము ఓ బెంచ్ మార్క్ సెట్ చేశాం. ఆ స్థాయికి తగ్గకుండా మ్యాచ్ నిర్వహించాలని వాళ్లకి సూచించా. అందుకు తగ్గట్టుగానే టెస్ట్ మ్యాచ్‌లతోపాటు ఆ తర్వాత జరిగే టీ20 సిరీస్‌కు సంబంధించిన టిక్కెట్లు కూడా అమ్ముడైపోయాయి. ఫ్యాన్స్ స్టేడియానికి తిరిగి రావాలని మేము కోరుకున్నాం. ప్రతీ సిరీస్‌లో ఒక పింక్ బాల్ టెస్ట్ ఉండాలి. టెస్ట్ క్రికెట్ సజీవంగా ఉండే విషయంలో పింక్ బాల్ మ్యాచ్ ప్రధాన మార్పు. నెక్స్ట్ వీక్ అహ్మదాబాద్‌లో ఫ్యాన్స్ సమక్షంలో జరగబోయే మ్యాచ్ అందరికీ మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది’ అని దాదా అన్నాడు. అలాగే, ఈ ఏడాది ఐపీఎల్‌ను కూడా ఫ్యాన్స్ మధ్యలో నిర్వహించే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు.
For More News..