T20 World Cup: సూపర్–8కి భారత్ జట్టులో మార్పులు?.. ప్లేయర్లకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు

T20 World Cup: సూపర్–8కి భారత్ జట్టులో మార్పులు?.. ప్లేయర్లకు సునీల్ గవాస్కర్ కీలక సూచనలు

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగే సూపర్–8 దశలోకి భారత జట్టు అడుగుపెట్టింది. ఫిబ్రవరి 22వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో తొలి సూపర్–8 మ్యాచ్‌లో టీమిండియా తలపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత ప్లేయింగ్ ఎలెవన్‌పై పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. జట్టులో మార్పుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాత్రం టీమ్‌లో కేవలం ఒకే ఒక్క మార్పు జరిగే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెస్ట్ తీసుకున్న అక్షర్ పటేల్ సూపర్–8 మ్యాచ్‌లో తప్పకుండా తుది జట్టులోకి వస్తాడు అని ధీమా వ్యక్తం చేశాడు. అతని కోసంఅర్ష్‌దీప్ సింగ్ ని బెంచ్‌కు పరిమితం చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.

ఇటీవల నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి వరల్డ్ కప్‌లో ఆడిన వాషింగ్టన్ సుందర్ నాలుగు ఓవర్లలో వికెట్ తీయకపోయినా, లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ అవసరం కాబట్టి, అతడికి మరో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయని సునీల్ గవాస్కర్ తెలిపారు. అహ్మదాబాద్ పిచ్ స్పిన్‌కు పెద్దగా సహకరించదనే కారణంతో కుల్దీప్ యాదవ్ కు ఈ మ్యాచ్‌లో కూడా ఛాన్స్ దక్కకపోవచ్చని పేర్కొన్నారు. గతంలో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లలో కూడా కుల్దీప్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదని సన్నీ గుర్తు చేశారు.

వాషింగ్టన్ సుందర్ 8వ స్థానంలో కూడా బ్యాటింగ్ చేయగలడు.. బంతిని బౌండరీకి తరలించే సామర్థ్యం అతడికి ఉంది.. అదే వాషికి ప్లస్ పాయింట్.. కాబట్టి అర్షదీప్ స్థానంలో అక్షర్ రావడం ఒక్కటే మార్పుగా నేను భావిస్తున్నాను అని మాజీ క్రికెటర్ గవాస్కర్ స్పష్టం చేశాడు. ఇదిలా ఉండగా, వరుసగా మూడు సార్లు డకౌట్స్ తో తీవ్రంగా నిరాశపరిచిన అభిషేక్ శర్మకు కీలక సూచనలు చేశాడు. భారీ షాట్లు కొట్టాలనే ఒత్తిడిని తగ్గించుకుని, ఎక్కువ సేపు క్రీజ్‌లో ఉండేందుకు ప్రయత్నం చేయాలని తెలిపాడు. ఫస్ట్ బాల్ నుంచే సిక్స్ లేదా ఫోర్ కొట్టాలని ప్రయత్నించాల్సిన అవసరం లేదన్నాడు.. ఒక సింగిల్ తీసుకుని ఖాతా తెరవాలి.. నాలుగు డాట్ బాల్స్ వచ్చినా పరవాలేదు.. ఆ తర్వాత వాటిని డాట్ అయినా బాల్స్ ని కవర్ చేయగల సత్తా అభిషేక్ కి ఉందని సన్నీ వెల్లడించారు. సూపర్–8 దశలో ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో.. భారత్ తీసుకునే నిర్ణయాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందో వేచి చూడాలి..