న్యూఢిల్లీ: బీసీసీఐ కొత్త చీఫ్‌గా ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాధ్యతలు తీసుకోనున్నాడు. బుధవారం జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో గంగూలీ పగ్గాలు చేపట్టి వచ్చే ఏడాది జూలై వరకు పనిచేయనున్నాడు. బోర్డు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బోర్డు కొత్త కార్యవర్గం కూడా కొలువు తీరనుంది. ఉపాధ్యక్షునిగా మహిమ్ వర్మ, సెక్రటరీగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొడుకు జై షా, ట్రెజరర్‌గా అరుణ్ ధుమాల్, జాయింట్ సెక్రటరీగా జయేశ్ జార్జ్ బాధ్యతలు స్వీకరిస్తారు. మరోవైపు గంగూలీ రాకతో 33 నెలలపాటు జరిగిన సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) పాలనకు ఎండ్‌కార్డ్ పడనుంది. సీఓఏలో ఇన్నాళ్లపాటు సేవలందించినందుకుగాను కాగ్ మాజీ చీఫ్ వినోద్ రాయ్, మాజీ కెప్టెన్ డయానా ఎడుల్జీ రూ.3.5 కోట్ల చొప్పున జీతాన్ని అందుకోనున్నారు.

