
బూర్గంపహాడ్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాకలో శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీటింగ్‌లో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీశ్ కుమార్ వెల్లడించారు. బూర్గంపహాడ్ ఎస్సై రాజేశ్, టాస్క్‌ఫోర్స్ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు జె. ప్రవీణ్, కె.సుమన్ కలిసి సారపాకలోని విలేజ్ పార్క్ వద్ద శుక్రవారం ఉదయం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ టైంలో భద్రాచలం నుంచి మణుగూరు అడ్డరోడ్డు వైపు మూడు కార్లలో వెళ్తున్న యువకులు పోలీసులను చూసి పారిపోయే ప్రయతనం చేశారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు కార్లను ఆపి తనిఖీ చేయడంతో గంజాయి దొరికింది.
దీంతో కార్లలో అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన కాద తనోజ అర్షిత్, హైదరాబాద్‌కు చెందిన కిషన్‌కుమార్ దాసు, జనగామ జిల్లా కొడకండ్ల మండలం రేగుల గ్రామానికి చెందిన భుక్యా దేవేందర్, సారపాకకు చెందిన రావులపల్లి ప్రతాప్, ములగాడ అన్వేశ్, హైదరాబాద్‌కు చెందిన బావికాడి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 61.82 లక్షల విలువైన 247 కిలోల గంజాయితో పాటు మూడు కార్లు, ఏడు సెల్‌ఫోన్లు, రూ.8,300 స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఆరుగురు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకున్న పోలీసులను ఎస్పీ రోహిత్‌రాజ్ అభినందించారు. సమావేశంలో పాల్వంచ సీఐ వినయ్‌కుమార్, ఎస్సైలు రాజేశ్, నాగభిక్షం, సుమన్, ప్రవీణ్ పాల్గొన్నారు.