హైదరాబాద్, వెలుగు: గంజాయి లేడీ డాన్ నీతూబాయి ఎట్టకేలకు ఈగల్ ఫోర్స్‌కు చిక్కింది. తొమ్మిదేండ్లుగా గంజాయి విక్రయిస్తున్న నీతూబాయిని అదుపులోకి తీసుకున్నట్లు ఈగల్ డైరెక్టర్ కార్యాలయం శనివారం వెల్లడించింది. నానక్‌రామ్‌గూడకు చెందిన నీతూబాయిపై 13 కేసులు ఉన్నాయి. పరారీలో ఉన్న ఆమె క్షేత్రస్థాయి నిఘా ఆధారంగా ఆమె కదలికలను ఈగల్ ఫోర్స్ టెక్నికల్ టీమ్ గుర్తించింది. శుక్రవారం మంగళ్‌హాట్ వైపు ఆటోలో వెళ్తుండగా నీతూ బాయిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.1.59లక్షలు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం సైబరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. నీతూబాయి కుటుంబసభ్యులు కూడా గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తద్వారా వచ్చిన సొమ్ముతో నిందితురాలు, ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లంగర్‌హౌస్‌లో రెండు జీ+3 భవనాలు, గచ్చిబౌలిలో ఒక జీ+2 భవనం, నానక్‌రామ్‌గూడలో నివాసానికి అదనపు నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. నిందితురాలు, కుటుంబ సభ్యులు, కుటుంబానికి చెందిన జయలక్ష్మి కిరాణా అండ్ జనరల్ స్టోర్ బ్యాంకు ఖాతాలను గతంలోనే ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఆస్తుల కొనుగోళ్ల వినియోగించిన నిధులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
