మెహిదీపట్నంలో దేవుడి ఫొటోల వెనుక గంజాయి

మెహిదీపట్నంలో  దేవుడి ఫొటోల వెనుక గంజాయి
  • గుట్టుచప్పుడు కాకుండా దందా
  • ఇద్దరు అరెస్టు, మరో ముగ్గురు పరారీ 

మెహిదీపట్నం, వెలుగు: దేవుడి పూజ గదిలో గంజాయి పెట్టి, వ్యాపారం చేస్తున్న ఇద్దరిని ధూల్ పేట ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎక్సైజ్ టీమ్ లీడర్ అంజిరెడ్డి వివరాల ప్రకారం.. ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో జియాగూడ కమెల వద్ద పోలీసులు గస్తీ నిర్వహించారు. 

ఈ క్రమంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ధూల్ పేట ప్రాంతానికి చెందిన రోహన్ సింగ్, యశ్వంత్ ను అదుపులోకి తీసుకొని, వారి ఇండ్లలో తనిఖీలు చేశారు. పూజ గదిలోని దేవుడి పటాల వెనుక  10.93 కిలోల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారితో పాటు ఉన్న స్వప్న మండలం, రాజీవీర్ బారిక్, రోహిత్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

సికింద్రాబాద్​లో 45 కిలోలు..

పద్మారావునగర్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠాను రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన బాలి సతీశ్ పవార్, రోహిత్ గోడాది చౌహాన్, రజనీ రోహిత్ చౌహాన్ , పద్మా అశోక్ పింపాలే కలిసి నాలుగు రోజుల కింద బెర్హంపూర్​లో 45 కిలోల గంజాయిని 21 ప్యాకెట్లుగా కొనుగోలు చేసి, ఫలక్​నుమా ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ చేరారు. రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా శనివారం వీరిని పట్టుకొని రిమాండ్​కు తరలించారు.