
గన్నవరం వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురయ్యింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం మరోసారి పొడిగించింది.మే 14 వరకు ఆయన రిమాండ్ ను పొడిగించింది కోర్టు.
మే 13తో తో రిమాండ్ ముగియనుండటంతో పోలీసులు ఆయన్ను విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా రిమాండును పొడిగిస్తూ న్యాయమూర్తి (జడ్జి) ఆదేశాలు జారీ చేశారు. రిమాండు పొడిగించడంతో వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు..
2024 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అనుచరులు, వైసీపీ నాయకులు దాడి చేసి నిప్పుబెట్టారు.గన్నవరం టీడీపీ కార్యాలయం ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. కార్యాలయ ఫర్నిచర్ను ధ్వంసం చేసి అక్కడే ఉన్న కొందరు టీడీపీ నేతలను గాయపరిచి వాహనాలను తగులబెట్టినట్టుగా వంశీ అనుచరులపై కేసు నమోదైంది.
వంశీ అనుచరులు గానీ, వైసీపీ కార్యకర్తలు గానీ.. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి వెనుక వంశీ పాత్ర ఉందని ఆయనను నిందితుడిగా చేర్చారు.
2025 ఫిబ్రవరి 13న హైదరాబాద్లో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. తర్వాత పలుసార్లు ఆయన రిమాండ్ పొడిగించింది కోర్టు.