
హైదరాబాద్ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం పరిసరాల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండడంతో రోడ్లపై చెత్త పేరుకుపోయింది. ఎక్కడ చూసినా చెత్తా చెదారం కనిపిస్తోంది. ముక్కుపుటాలు అదిరే దుర్గంధం వస్తోంది.
సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం బస్టాప్ పరిసరాల్లో ఎక్కడ చూసినా కూరగాయల వ్యర్థలే కనిపిస్తున్నాయి. అటు వైపు నుంచి వెళ్లే వాళ్లు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతిరోజూ ఉదయం వాకింగ్ వెళ్లే వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇండోర్ స్టేడియం పరిసరాల్లోని చెత్తా చెదారం పేరుకుపోవడంపై స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రాంకీ వాహనాలను తెప్పించి హడావుడిగా చెత్తను తీసుకెళ్తున్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉండడంతో రోడ్లపై చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తోంది.
మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని ప్రజలు కోరుతున్నారు. కరోనా సమయంలో కార్మికులు చేసిన సేవ మరెవరూ చేయలేదని చెప్పారు. కార్మికులు అడుగుతున్నవి గొంతెమ్మ కోర్కెలు కావని, వాళ్లు చేసే పని ఇతరులెవరూ చేయలేరని చెబుతున్నారు. వైన్స్ టెండర్లు, ఎమ్మెల్యేల టికెట్లపై ప్రత్యేక ఫోకస్ పెడుతున్న రాష్ర్ట ప్రభుత్వం.. కార్మికులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు పబ్లిక్.