బల్దియా జనరల్ బాడీ  మీటింగ్ వాయిదా

బల్దియా జనరల్ బాడీ  మీటింగ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు: స్వచ్ఛ ఆటోల లక్ష్యం పక్కదారి పడుతోందని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్​విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పనితీరు మార్చుకోకపోతే ఆటోలను ఇతరులకు కేటాయిస్తామని హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్ట్ లో భాగంగా రాంకీ సంస్థ సోషల్ రెస్పాన్స్ బిలిటీ కింద 5,300 డస్ట్ బిన్ లను జీహెచ్ఎంసీకి అందజేసింది. సోమవారం వాటిని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి హెడ్డాఫీసులో పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని జీహెచ్ఎంసీ గ్యారెంటీతో బ్యాంకు లోన్లు ఇప్పించి స్వచ్ఛ ఆటోలు అందిస్తుంటే ఇలా చేయడం కరెక్ట్​కాదన్నారు.

ఇండ్ల నుంచి చెత్త సేకరణ పూర్తిస్థాయిలో జరగడం లేదనే ఆరోపణలు వస్తున్నాయని, ఉదయం 6 గం. నుంచి 11 వరకు తప్పనిసరిగా కేటాయించిన కాలనీల్లోని చెత్తను 100 శాతం సేకరించాలన్నారు. ఆ తర్వాతనే కాలనీల నుంచి బయటకు వెళ్లాలన్నారు. అలాగే జీహెచ్ఎంసీ నిర్దేశించిన మొత్తాని కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 2,650 పారిశుద్ధ్య బృందాలు ఉండగా ఒక్కోదానికి రెండు వీట్​డస్ట్ బిన్ల చొప్పున అందజేస్తున్నట్లు మేయర్​తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్  సంతోష్, ఎస్ఈ కోటేశ్వరరావు, సీఎం హెచ్ఓ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

బల్దియా జనరల్ బాడీ  మీటింగ్ వాయిదా

జీహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్ వాయిదా పడింది. ఈ నెల 29న నిర్వహించాలని అనుకున్నప్పటికీ పలు కారణాలతో వచ్చే నెలకు వాయిదా పడినట్లు సోమవారం బల్దియా అధికారులు ప్రకటించారు. తొందరలోనే ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని చెప్తామన్నారు.

గణపతి నిమజ్జనానికి  74 కొలనులు

బల్దియా హెడ్డాఫీసులో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డితో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సోమవారం మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని మేయర్​పిలుపునిచ్చారు. గ్రేటర్​వ్యాప్తంగా 4 లక్షల మట్టి వినాయకును ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. నిమజ్జనం కోసం 74 కొలనులు, 280 క్రేన్లు, గజ ఈతగాళ్లను రెడీ చేశామన్నారు.