డెలివరీ పేరుతో దోపిడీ.. పట్టించుకోని గ్యాస్ ఏజెన్సీలు

V6 Velugu Posted on Feb 05, 2021

  • గ్యాస్​ ఏజెన్సీల అదనపు బాదుడు
  • సిలిండర్ డెలివరీపై ఎక్స్‌ట్రా చార్జీలంటూ దోపిడీ
  • 5 కిలో మీటర్ల ఫ్రీ సర్వీస్ కు కూడా డబ్బులు వసూలు
  • ఒక్కో సిలిండర్ పై రూ.30 – రూ.50 దాకా చార్జి
  • డెలివరీ బాయ్స్​తో దందా చేయిస్తోన్న ఏజెన్సీలు
  • కంప్లయింట్లు చేస్తున్నా పట్టించుకోని ఆయిల్ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: గ్యాస్ సిలిండర్ డెలివరీ  ఫ్రీ గా చేయాల్సి ఉన్నా  సిటీలో ఏజెన్సీలు ఇష్టమొచ్చినట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. డోర్​డెలివరీకి రూ. 20 నుంచి రూ.50 వరకు తీసుకుంటున్నాయి. ఇలా రోజుకు రూ.50 లక్షల వరకు గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్స్ దోపిడీ చేస్తున్నారు. వసూలు చేస్తున్నది డెలివరీ బాయ్స్ అయితే డబ్బులన్నీ ఏజెన్సీలు తీసుకుంటున్నాయి. కస్టమర్ల నుంచి డెలివరీ చార్జీలు మస్ట్​గా వసూలు చేయాలని ఏజెన్సీలే చెబుతున్నాయి. గ్యాస్ కంపెనీలు ఒక్కో సిలిండర్ డెలివరీకి రూ. 14  ఇస్తున్నాయి. అయితే   ఇవి ఎటూ సరిపోతలేవంటూ కస్టమర్లపైనే ఏజెన్సీలు అదనంగా భారం వేస్తున్నాయి.

లైట్​ తీసుకుంటున్న కంపెనీలు

ఏజెన్సీల అదనపు చార్జీల వసూలును ఆయిల్ కంపెనీలు పట్టించుకోవడం లేదు. అదనంగా చార్జీలు వసూలపై కంప్లయింట్​ చేస్తే  ఏజెన్సీల గుర్తింపు రద్దు చేయాల్సిన ఉన్నా లైట్​గా తీసుకుంటున్నాయి. దోపిడీపై నియంత్రణ కు సరైన వ్యవస్థ లేదు. కస్టమర్ అవసరాన్ని బట్టి డెలివరీ చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై ఎంతో మంది కస్టమర్ల నుంచి ఆయిల్ కంపెనీలకు కంప్లయింట్లు కూడా వెళ్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులు మాత్రం ఆయిల్ కంపెనీలు డెలివరీకి ఇచ్చే చార్జీల రేటు చాలా తక్కువగా ఉందంటుని పేర్కొంటున్నారు.

లక్షకు పైగా డెలివరీ

సిటీలో 28 లక్షల గ్యాస్ కస్టమర్లు ఉండగా, రోజుకు లక్షా 80 వేలకు పైగా సిలిండర్లు డెలివరీ అవుతుంటాయి. ఇందులో డోర్ డెలివరీ చేసేవి  లక్ష వరకు ఉంటాయి. సిటీలో 135 ఏజెన్సీలు ఉంటే దాదాపు 80 శాతం అదనంగా వసూలు చేస్తున్నాయి. కస్టమర్ల నుంచి వసూలు చేసే చార్జీలకు మాత్రం లెక్క చూపడం లేదు.  డెలివరీ చార్జీల కింద రోజుకు ఒక్కో ఏజెన్సీకి కనీసం రూ.50 వేల వరకు వస్తున్నాయి.

5 కిలో మీటర్లలోపైతే..

రూల్స్​ప్రకారం గ్యాస్ ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల పరిధిలో ఫ్రీ డెలివరీ చేయాలి.  అదే 5  నుంచి 25 కిలో మీటర్లలోపు రూ. 10 –15- , 30 కిలోమీటర్ల దూరమైతే రూ. 15 ఎక్స్ ట్రా తీసుకోవాలి. కానీ 5 కిలోమీటర్ల లోపు ఉన్న వాటికి కూడా కచ్చితంగా రూ. 20 ఇవ్వాలని డెలివరీ బాయ్స్​ డిమాండ్ చేస్తున్నారు. ఇన్ స్టంట్ డెలివరీ పేరుతో  రూ. 100 వసూలు చేస్తున్నారు.

For More News..

రూల్స్ బ్రేక్ చేస్తే క్లిక్ మనిపిస్తున్న ‘సిటిజన్​’ పోలీస్​

ఈటల రాజేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సీఎం చేయాలె

మేయర్ పోస్టుకు పోటీచేయాలని మజ్లిస్‌కు టీఆర్ఎస్ ఆఫర్

Tagged Telangana, Gas Price, Oil companies, Delivery fees, Gas agencies, gas delivery, Gas rates

Latest Videos

Subscribe Now

More News