మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తే... గ్యాస్ సిలిండర్ రూ.2 వేలు : మమతా బెనర్జీ

మళ్లీ కేంద్రంలో బీజేపీ వస్తే...   గ్యాస్ సిలిండర్ రూ.2 వేలు :  మమతా బెనర్జీ

కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ. 2 వేలకు పెంచుతుందని టీఎంసీ చీఫ్,  పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. మార్చి1న ఝర్‌గ్రామ్‌ జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో సీఎం ఈ కామెంట్స్ చేశారు. " రాబోయే లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ మనం  బీజేపీని గెలిస్తే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.  1,500 లేదా  2,000 కి పెంచవచ్చు . మళ్లీ మనం వంటలు చేసుకోవడానికి  పాత పద్ధతికి వెళ్లాలి" అని మమతా బెనర్జీ అన్నారు.  రాష్ట్రంలో ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని  కేంద్ర ప్రభుత్వానికి మమత అల్టిమేటం జారీ చేశారు.  లేకుంటే తమ ప్రభుత్వం మే నుంచి వాటి నిర్మాణాన్ని ప్రారంభిస్తుందని తెలిపారు.  

మరోవైపు  పశ్చిమ బెంగాల్ లోని సందేశ్ ఖాలీలో భూకబ్జాలు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్  షాజహాన్ ను   పోలీసులు అరెస్టు చేశారు. జనవరి 5న సోదాలకు వచ్చిన ఈడీ అధికారులపై దాడి చేసిన 55 రోజుల తర్వాత అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రంలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్​ఖాలీలో స్థానికుల భూములను కబ్జా చేశాడని, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని షాజహాన్ పై ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపులు, దోపిడీలు, సెటిల్ మెంట్లు కూడా చేశాడని స్థానికులు గతంలో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.