అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్..11 మందికి తీవ్ర అస్వస్థత

అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్..11 మందికి తీవ్ర అస్వస్థత

జీడిమెట్ల, వెలుగు : బాచుపల్లిలోని అరబిందో ఫార్మా కంపెనీలో గ్యాస్ లీకై 11 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం 9 గంటల టైంలో యూనిట్ 3లో సాల్వెంట్స్ ప్రాసెసింగ్ జరుగుతున్నది. ఓ కెమికల్ డ్రమ్ములో ఉన్న మెథైల్ డై క్లోరైడ్ అనే సాల్వెంట్​ను స్టెయిన్ లెస్​ స్టీల్ వెజల్​లోకి పైపు ద్వారా పంపుతున్నారు. ఒక్కసారిగా ఆ పైపు వెజల్ నుంచి కింద పడటంతో మెథైల్ డై క్లోరైడ్ బయటికొచ్చి గ్యాస్​ లీకైంది.

ఘాటు ఎక్కువగా ఉండటంతో అక్కడే పనిచేస్తున్న గౌరీనాథ్ (35), యాసిన్ అలీ (29), ప్రేమ్​కుమార్ (47), ప్రసాద్ రాజు (35), శ్రీనివాస్ (47), విమల(34), గౌరీ (37), చిరంజీవి(35), మల్లికార్జున(28), రమణ (41), సాయివెంకట విఘ్నేశ్ (23) ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. వీరిలో కొంత మంది అక్కడే స్పృహ తప్పి పడిపోయారు. కొందరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో సిబ్బంది హాస్పిటల్​కు తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేనేజ్​మెంట్​ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల లీడర్లు ఆరోపిస్తున్నారు.