
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు సౌదీ అరేబియాలో ఘనంగా జరిగాయి. “సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య” ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు కుమారులు నందమూరి రామకృష్ణ, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, శ్రీ టి.డి.జనార్ధన్, ప్రముఖ సినీ నటి ప్రభ, నందమూరి బెనర్జీ, నందమూరి బిజిలి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్ టి.డి.జనార్ధన్ మాట్లాడుతూ ‘‘ మనకు రాముడు, కృష్ణుడు తెలుసు, అలాగే శరవన శకం తెలుసు, శాలివాహన రాజులు తెలుసు. ఆ తర్వాత తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునేది, గుండెల్లో పెట్టుకునేది ఎన్టీఆర్ నే. ఆయన తన సినిమాల ద్వారా మంచి సందేశాన్ని సమాజానికి అందించారు. ఎన్టీఆర్ గారు సినిమాల్లో నటించేవారు అనేకన్నా జీవించారు అని చెప్పడం కరెక్ట్. రాజకీయాల్లో ఆయన ఏం చెప్పారో అదే చేశారు. ప్రజా నాయకుడిగా మనసులు గెల్చుకున్నారు’’ అని అన్నారు
ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ ప్రసంగిస్తూ - ‘‘మా నందమూరి కుటుంబంపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు కడుపు నిండిపోతోంది. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం సంతోషంగా ఉంది. ఇంత ఘనంగా కార్యక్రమం నిర్వహించిన సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య వారికి కృతజ్ఞతలు. ఎన్టీఆర్ గారు నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రల్లో అద్వితీయ నటన చూపించారు. ఆయన తను పోషించిన ప్రతి పాత్రకు ఒక డిక్షనరీగా మారారు’’ అని అన్నారు..
►ALSO READ | VijayDevarakonda: దేవరకొండ కొత్త సినిమాల అప్డేట్స్.. ఒకదానికి మించి మరొకటి.. యదార్థ సంఘటనలతో..
నందమూరి బెనర్జీ మాట్లాడుతూ -.. ‘‘ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. సినీరంగంలో ఎన్టీఆర్ ఖ్యాతిని మరో నటుడు అందుకోలేరు. ఆయన తను నటించే పాత్రల్లో జీవించేవారు. ఆ క్యారెక్టర్స్ ను అర్థం చేసుకునేవారు. ఒక్కో సినిమాలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి కూడా ప్రేక్షకుల్ని మెప్పించారు. మరో నటుడికి సాధ్యం కాని ఎన్నో ఘనతలు ఎన్టీఆర్ వెండితెరపై సుసాధ్యం చేశారు’’ అని అన్నారు.
ప్రముఖ నటి ప్రభ మాట్లాడుతూ - ‘‘ ఎన్టీఆర్ గారి జీవితంలోని ఎన్నో విశేషాలతో ‘తారకరామం’ అనే పుస్తకం రాయడం అభినందనీయం. ఎన్టీఆర్ గారు నటుడిగా ఎన్నో పౌరాణిక, సామాజిక, జానపద పాత్రలతో ప్రేక్షకుల్లో మనసుల్లో చిరస్మరణీయులు అయ్యారు. ఆయన రాముడిగా, కృష్ణుడిగా, రావణాసురుడిగా, దుర్యోధనుడిగా..ఇలా ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో గుర్తుండిపోయారు. ఎన్టీఆర్ పిల్లలు కూడా ఆయన వారసత్వాన్ని ఘనంగా ముందుకు తీసుకువెళ్తున్నారు’’ అని అన్నారు.