వాజ్ పేయి బ్రిటీష్ ఇన్ఫార్మర్‭గా పనిచేశారు: గౌరవ్ పాండి

వాజ్ పేయి బ్రిటీష్ ఇన్ఫార్మర్‭గా పనిచేశారు: గౌరవ్ పాండి

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి రోజున ఆయనపై కాంగ్రెస్ లీడర్ గౌరవ్ పాండి వివాదాస్పద కామెంట్లు చేశారు. వాజ్ పేయ్.. బ్రిటిష్ ఇన్ఫార్మర్ గా పని చేశారని ఆరోపించారు. ‘‘1942లో అందరూ ఆర్ఎస్ఎస్ సభ్యుల లాగే వాజ్ పేయి కూడా క్విట్ ఇండియా ఉద్యమాన్ని బహిష్కరించారు. బ్రిటిష్ ఇన్ఫార్మర్ గా పని చేశారు. ఆందోళనలో పాల్గొన్న వాళ్ల గురించి బ్రిటిషోళ్లకు చెప్పారు. నెల్లి ఊచకోత గానీ, బాబ్రీ మసీదు కూల్చివేత గానీ.. ఈ రెండింటిలోనూ అల్లరి మూకలను రెచ్చగొట్టడంలో వాజ్ పేయి కీలక పాత్ర పోషించారు. అందుకే బీజేపీ వాళ్లు మోడీని వాజ్ పేయి, సావర్కర్ తో పోల్చడం లేదు. గాంధీ, పటేల్ తో పోలుస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు నిజం తెలుసు” అని గౌరవ్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, బీజేపీపై కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ కూడా విమర్శలు చేశారు. ‘‘ఇయ్యాల వాజ్ పేయ్ జయంతి. ఆయన మొదటిసారి ఎంపీగా ఎన్నికైన టైమ్ లో చైనా దురాక్రమణలపై చర్చించేందుకు పార్లమెంట్ ను షెడ్యూల్ కంటే ముందుగానే సమావేశపరచాలని నెహ్రూకు లెటర్ రాశారు. అందుకు నెహ్రూ అంగీకరించారు. కానీ ఇప్పుడు చైనా చొరబాట్లకు పాల్పడుతున్నప్పటికీ.. పార్లమెంటులో కనీసం చర్చించడం లేదు” అని ట్వీట్ చేశారు. 

కాంగ్రెస్ క్షమాపణ చెప్పాల్సిందే: బీజేపీ

గౌరవ్ పాండి కామెంట్లపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వీర్ సావర్కర్, బీఆర్ అంబేద్కర్, వాజ్ పేయి లాంటి మహానుభావులను కించపరిచే అలవాటు కాంగ్రెస్ కు ఉందని విమర్శించింది. ‘‘ఇయ్యాల దేశమంతా వాజ్ పేయి సేవలను గుర్తు చేసుకుంటోంది. కానీ, కాంగ్రెస్ మాత్రం ఆయనను కించపరిచింది. ఆ పార్టీ తన అసలు రూపం బయటపెట్టింది. వాజ్ పేయిపై కామెంట్లు చేసిన గౌరవ్ పాండి.. రాహుల్ గాంధీకి సన్నిహితుడు” అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు.