గంభీర్‌తో బీసీసీఐ చర్చలు.. హెడ్ కోచ్‌గా రానున్నాడా..?

గంభీర్‌తో బీసీసీఐ చర్చలు.. హెడ్ కోచ్‌గా రానున్నాడా..?

టీమ్ ఇండియా హెడ్ కోచ్ పాత్రపై బీసీసీఐ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే కేకేఆర్ మెంటార్, టీమిండియా మాజీ ఓపెనర్ గంభీర్ తో బీసీసీఐ సెక్రటరీ జైషా  సుదీర్ఘంగా చర్చించినట్లు జరిపినట్టు క్రిక్ బజ్ నివేదిక వెల్లడించింది. గంభీర్ దాదాపు టీమిండియా హెడ్ కోచ్ గా రాబోతున్నట్టు.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు మూడు ట్రోఫీలు రావడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. 2012, 2014 కేకేఆర్ కు కెప్టెన్ గా  టైటిల్స్ అందించిన గంభీర్.. ఇటీవలే ముగిసిన సీజన్ లో మెంటార్ గా జట్టుకు ట్రోఫీ అందించాడు. అంతకముందు 2021, 2022 సీజన్ లలో లక్నో మెంటార్ గా వ్యవహరించిన గౌతీ.. రెండు సీజన్ ల పాటు జట్టును ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఈ కారణంగానే గంభీర్ పై బీసీసీఐ ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. 

టీ 20 ప్రపంచ కప్ జూన్ లో ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రావిడ్ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ప్రధాన కోచ్ పదవి కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని  ద్రవిడ్ ను బీసీసీఐ  కోరినా.. ఆయన ఆసక్తి లేదని బోర్డుకి తెలియజేసినట్లు సమాచారం. నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సిఎ) కోచ్ వివిఎస్ లక్ష్మణ్ కూడా భారత జట్టుకు ప్రధాన కోచ్ పదవిని చేపట్టడం పట్ల నిరాసక్తతను వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి.