బుమ్రా ఎన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడతాడు?..మ్యాచ్​ల ఫలితాన్ని బట్టే నిర్ణయమన్న చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ 

బుమ్రా ఎన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడతాడు?..మ్యాచ్​ల ఫలితాన్ని బట్టే నిర్ణయమన్న చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ 
  • నేనెప్పుడూ ఒత్తిడిలోనే ఉంటా

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌‌‌‌తో జరిగే ఐదు టెస్ట్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో స్టార్‌‌‌‌ పేసర్‌‌‌‌ జస్ప్రీత్‌‌‌‌ బుమ్రా ఎన్ని మ్యాచ్‌‌‌‌లు ఆడతాడు?.. ఈ అంశంపై టీమిండియా చీఫ్‌‌‌‌ కోచ్‌‌‌‌ గౌతమ్‌‌‌‌ గంభీర్‌‌‌‌ పెద్దగా స్పష్టత ఇవ్వలేదు. ‘బుమ్రా ఏ మూడు మ్యాచ్‌‌‌‌లు ఆడతాడు అనే దానిపై మేం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సిరీస్‌‌‌‌ ఫలితాలను, అది ఎలా సాగుతుందనే దాన్ని బట్టి మేం అతనితో చర్చిస్తాం. ఈ అంశంపై బుమ్రాకు కూడా క్లారిటీ ఉందని భావిస్తున్నాం.

టీమ్‌‌‌‌లో జస్ప్రీత్‌‌‌‌ చాలా కీలకమైన బౌలర్‌‌‌‌. అతన్ని వేరొకరితో భర్తీ చేయలేం. కాకపోతే మాకూ నాణ్యమైన బౌలర్లు అందుబాటులో ఉన్నారు. చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ టైమ్‌‌‌‌లో చెప్పినట్లుగా బుమ్రా గైర్హాజరీ మరో ప్లేయర్‌‌‌‌కు మంచి అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకోవడానికి ముందుకు రావాలి. ప్రస్తుతానికి బుమ్రా ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌పై ఎలాంటి సమస్యల్లేవు’ అని గురువారం జరిగిన మీడియా సమావేశంలో గౌతీ పేర్కొన్నాడు.

ఫలితాలతో సంబంధం లేకుండా తాను ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటానని చెప్పాడు. అయితే ఎక్కువగా తాను ఫలితాలపైనే దృష్టి పెడతానని చెప్పిన గంభీర్‌‌‌‌.. తన భవిష్యత్‌‌‌‌ గురించి వస్తున్న వార్తలపై స్పందించేందుకు నిరాకరించాడు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని  తమకు అనుకూలంగా ఫలితాలను రాబట్టే తుది జట్టును మాత్రమే ఎంపిక చేస్తామన్నాడు.

‘క్రికెట్‌‌‌‌ అంటేనే ఫలితాలతో చేసే వ్యాపారంలాంటిది. ఓటమి రికార్డు ఎప్పుడూ నన్ను ప్రభావితం చేయదు. మాకు ఫలితాలు వచ్చాయో లేదో అనే దానితో సంబంధం లేకుండా నేను ఎల్లప్పుడూ ఒత్తిడిలోనే ఉంటాను. ఒకవేళ న్యూజిలాండ్ సిరీస్‌‌‌‌ తర్వాత మీరు ఈ ప్రశ్న అడిగినా ఇదే సమాధానం చెప్పేవాడిని. ఆస్ట్రేలియా టూర్, చాంపియన్స్‌‌‌‌ ట్రోఫీ తర్వాత అడిగినా ఇదే చెప్పేవాడిని’ అని గంభీర్‌‌‌‌ వెల్లడించాడు. తానెప్పుడూ రోడ్‌‌‌‌ షోలను నమ్మనని గౌతీ చెప్పాడు. వీటికంటే ప్రజల జీవితాలు చాలా ముఖ్యమైనవని గుర్తు చేశాడు. 

ఇంట్రా స్క్వాడ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ తర్వాతే: గిల్‌‌‌‌

ఇంట్రా స్క్వాడ్​ మ్యాచ్​ తర్వాతే బ్యాటింగ్​ ఆర్డర్​పై స్పష్టత వస్తుందని కొత్త కెప్టెన్‌‌‌‌ శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌ అన్నాడు. బుమ్రా స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు ఏ పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌‌‌‌ గెలిపించే నాణ్యమైన బౌలర్లు తమ వద్ద ఉన్నారన్నాడు ‘మాకు సరిపోయినంత బౌలింగ్‌‌‌‌ అందుబాటులో ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్‌‌‌‌ గెలిచే సత్తా మా వద్ద ఉంది.

బుమ్రాను ఎన్ని మ్యాచ్‌‌‌‌ల్లో ఆడించాలనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అతను ఎప్పుడు తిరిగి అందుబాటులో ఉంటాడనే దానిపైనే మేం చర్చిస్తున్నాం. మిగతా బౌలింగ్ లైనప్‌‌‌‌ కూడా చాలా బాగుంది. కాబట్టి మ్యాచ్​ల ఫలితాన్ని బట్టి మేం నిర్ణయాలు తీసుకుంటాం’ అని గిల్‌‌‌‌ వ్యాఖ్యానించాడు.