
ఆసియా కప్ సూపర్-4 లో టీమిండియా ఆదివారం (సెప్టెంబర్ 21) తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై మరోసారి విజయ డంఖా మోగించాలని భావిస్తోంది. దుబాయ్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగబోతుంది. ఓ వైపు ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. మరోవైపు ఆదివారం కావడంతో ఈ మ్యాచ్ కు భారీ హైప్ నెలకొంది. పాక్ ను మరోసారి చిత్తు చేయాలని టీమిండియా ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మ్యాచ్ కు ముందు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఆదివారం పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ ను భారత జట్టు సీరియస్‌గా తీసుకోకూడదని సునీల్ గవాస్కర్ కోరుకుంటున్నాడు. సెప్టెంబర్ 28న జరిగే ఆసియా కప్ ఫైనల్ పైనే దృష్టి పెట్టాలని భావిస్తున్నాడు. పాకిస్థాన్ పై బుమ్రా ఆడకపోయినా పెద్దగా నష్టం లేదని తెలిపాడు. గవాస్కర్ మాట్లాడుతూ.. " జస్‌ప్రీత్ బుమ్రాకు పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో రెస్ట్ ఇవ్వాలని నేను భావిస్తున్నాను. సెప్టెంబర్ 28 న జరగబోయే ఫైనల్ మ్యాచ్ కు బుమ్రాను ఫిట్ గా ఉండేలా చూసుకోవాలి. ఈ విషయంపై ఇండియా ఒకసారి ఆలోచించుకోవాలి. తుది నిర్ణయం మాత్రం బుమ్రాకే వదిలేయాలి". అని గవాస్కర్ ఆసియా కప్ బ్రాడ్‌కాస్టర్ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో అన్నారు.
శుక్రవారం (సెప్టెంబర్ 19) ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. బుమ్రా స్థానంలో అర్షదీప్ సింగ్ జట్టులోకి వచ్చాడు. పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ లో బుమ్రా బరిలోకి దిగనున్నాడు. అదే జరిగితే అర్షదీప్ సింగ్ మరోసారి బెంచ్ కు పరిమితం కావొచ్చు. ఒమన్ తో జరిగిన మ్యాచ్ కు దూరంగా ఉన్న బుమ్రాతో పాటు వరుణ్ చక్రవర్తి పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ కు అందుబాటులో ఉండడనున్నాడు. బలహీనమైన పాకిస్థాన్ పై టీమిండియా మరోసారి ఆధిపత్యం చూపించాలని చూస్తుంటే.. ఈ సారి ఎలాగైనా ఇండియాకు షాక్ ఇవ్వాలని పాకిస్థాన్ గట్టి పట్టుదలతో కనిపిస్తోంది. ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి 8 గంటలకు సోనీ స్పోర్ట్స్ లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.