- డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం సభ్యులుగా నమోదు
నల్గొండ, వెలుగు: వారం కింద నల్గొండ జిల్లా కోదాడలో జరిగిన హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గే డేటింగ్ యాప్‌ల వినియోగం విస్తృతంగా పెరిగినట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతికత విస్తరణ, స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం కారణంగా యువత డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుంటోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రేమ, స్నేహం, ఆకర్షణల పేరుతో పరిచయాలు పెంచుకుంటూ.. ప్రమాదకర పరిస్థితుల్లో పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ఒక ప్రముఖ గే డేటింగ్ యాప్‌లోనే 30 వేల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం గమనార్హం. పోలీసుల విచారణలో ఈ యాప్‌లను వాడుతున్న వారిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు యువతేనని తేలింది.
డాక్టర్లు, లాయర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు వంటి విద్యావంతులు, ఉన్నత ఉద్యోగులు ఇందులో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించారు. నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ యాప్‌లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించాయని, గరిడేపల్లి, కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట రూరల్ ప్రాంతాల్లో వీటి వినియోగం పెరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ యాప్‌ల ద్వారా పరిచయాలు పెంచుకొని కొందరు కేటుగాళ్లు బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం. ఏకాంత ప్రాంతాలు, లాడ్జీలకు పిలిచి వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించి, వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోదాడ హత్య కేసులోనూ నిందితుడు, బాధితుడు గే డేటింగ్ యాప్ ద్వారానే పరిచయం అయినట్లు దర్యాప్తులో తేలింది.
బ్లాక్ మెయిల్ వివాదమే చివరకు హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు యాప్‌లపై నిఘా పెట్టి చాటింగ్ హిస్టరీ, కాల్ డేటా పరిశీలిస్తున్నారు. యువత మోసాలకు గురికాకుండా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపడతామని సూర్యాపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తెలిపారు.
