గే లాయర్ సౌరభ్ కిర్పాల్​ను జడ్జిగా నియమించాల్సిందే : సుప్రీం

గే లాయర్ సౌరభ్ కిర్పాల్​ను  జడ్జిగా నియమించాల్సిందే : సుప్రీం
  • కేంద్రానికి సుప్రీం కొలీజియం మరోసారి సిఫార్సు

న్యూఢిల్లీ: సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్పాల్ ను ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాల్సిందేనని సుప్రీంకోర్టు కొలీజియం మరోసారి కేంద్రానికి తేల్చిచెప్పింది. బహిరంగంగానే తాను గే (స్వలింగ సంపర్కుడు) అని చెప్పుకున్నందుకు, ఆయన పార్ట్ నర్ స్విట్జర్లాండ్ దేశస్తుడు అయినందుకు జడ్జిగా తిరస్కరించడం సరికాదని స్పష్టం చేసింది. కిర్పాల్ తో పాటు కేంద్రం తిరస్కరించిన మరో ఇద్దరు సీనియర్ అడ్వకేట్లనూ జడ్జిలుగా నియమించాలని సిఫార్సు చేసింది. సోమశేఖర్ సుందరేశన్ ను బాంబే హైకోర్టు జడ్జిగా, ఆర్ జాన్ సత్యన్ ను మద్రాస్ హైకోర్టు జడ్జిగా నియమించాలని సూచించింది.

ఈ మేరకు కేంద్రానికి పంపిన లేఖను సుప్రీంకోర్టు తొలిసారిగా తన వెబ్ సైట్​లో పబ్లిష్ చేసింది. రూల్స్ ప్రకారం, జడ్జిల నియామకం కోసం సుప్రీంకోర్టు కొలీజియం రెండోసారి పంపే పేర్లను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, ఈ ముగ్గురి నియామకం విషయంలో కేంద్రం, సుప్రీం కొలీజియం మధ్య ఇటీవల మాటల యుద్ధం నడిచింది. సౌరభ్ కిర్పాల్ తాను గే అన్న విషయాన్ని దాచిపెట్టలేదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ సంతకాలు చేసిన సిఫారసు లేఖలో పేర్కొన్నారు.