మహిళల కష్టాల్ని, కన్నీళ్లను పెయింటింగ్స్‌గా వేసి..

మహిళల కష్టాల్ని, కన్నీళ్లను పెయింటింగ్స్‌గా వేసి..

బ్యాలె డాన్సర్లని అలానే చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. బ్యాలె డాన్సర్ల బొమ్మల్ని ఆర్ట్​గా వేస్తూ  పాలస్తీనాలోని మహిళల కన్నీళ్లు, కష్టాల్ని  చెబుతోంది గాజాకి చెందిన అబీర్​ జెబ్రిల్​. కట్టుబాట్ల నడుమ నలిగిపోతున్న అక్కడి మహిళలు స్వేచ్ఛ కోసం చేస్తోన్న పోరాటాన్ని పెయింటింగ్స్​గా వేస్తోంది. 

ఈజిప్టు, ఇజ్రాయిల్​ దేశాల సరిహద్దులో ఉన్న గాజాలో ఎప్పుడూ యుద్ధ వాతావరణమే ఉంటుంది. దానికి తోడు ఎన్నో కట్టుబాట్లు అక్కడి మహిళల కలల్ని కల్లలు చేస్తున్నాయి. ఏండ్ల తరబడి ఈ పరిస్థితుల్ని చూస్తోన్న అబీర్  తమ బాధల్ని పెయింటింగ్స్​గా వేసి చెప్పాలనుకుంది. ​ఆమె వేసిన ప్రతి పెయింటింగ్ గాజాలోని మహిళల పరిస్థితుల్ని కళ్లకి కడుతుంది. ఇనుప గొలుసులతో కట్టేసిన,  బుల్లెట్​ నుంచి తప్పించుకుంటున్న,  బారికేడ్లకి ఎదురెళ్లుతున్న బ్యాలె డాన్సర్ల పెయింటింగ్స్ గాజాలోని మహిళల బాధని, దు:ఖాన్ని, స్వేచ్ఛ కోసం వాళ్లు చేస్తున్న పోరాటాన్ని చెబుతాయి. గాజా మహిళలు ఏం అనుకుంటున్నారు? ఎలా బతుకుతున్నారు? ఎలాంటి సిచ్యుయేషన్స్​ ఎదుర్కొంటున్నారు? అనేవి ఆ పెయింటింగ్స్​ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. అబీర్​ పెయింటింగ్స్​ యూరప్, అరబ్​​ దేశాల్లోని ఎగ్జిబిషన్లలో చోటు సంపాదించాయి కూడా.    

బ్యాలె డాన్సర్​ థీమ్​ ఎందుకంటే..

అబీర్​ తన పెయింటింగ్స్​కి బాలె డాన్సర్​ థీమ్​ తీసుకోవడానికి కారణం ఉంది. ‘‘బ్యాలె డాన్స్  మహిళల్ని అందంగా, స్వేచ్ఛగా, శక్తివంతంగా చూపిస్తుంది. అందుకే బ్యాలె డాన్సర్ థీమ్​తో పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టాను” అని చెబుతోంది అబీర్. ఆమె​కి ఆదర్శం ఎవరంటే  బ్యాలె డాన్సర్ల బొమ్మల్ని  వేసే  ఫ్రాన్స్ ఆర్టిస్ట్ ఎడ్గర్​ డెగాస్. ఇంటర్నేషనల్‌‌ బ్యాలె డాన్సర్ల ప్రభావం కూడా ఆమెపై ఉంది. అబీర్​ పదకొండేళ్ల కూతురు మాయ కూడా బ్యాలె డాన్స్ నేర్చుకుంటోంది.