గాజాలో పరిస్థితి దయనీయం.. అనస్థీషియా లేకుండా క్షతగాత్రులకు ఆపరేషన్లు

గాజాలో పరిస్థితి దయనీయం.. అనస్థీషియా లేకుండా క్షతగాత్రులకు ఆపరేషన్లు

గాజా నగరంలో అల్ అహ్లీ ఆసుపత్రిపై దాడి తర్వాత అక్కడ పరిస్థితి మరింత దారుణంగా..దయనీయంగా తయారైంది. గాయపడిన వారికి చికిత్స అందించడం కోసం వైద్యులు పడిన బాధలు వర్ణణాతీతం. సరైన వైద్య సామాగ్రి కూడా లేకపోవడంతో చికిత్స అందించడం కోసం డాక్టర్లు నానా తంటాలు పడ్డారు. 

గాజా నగరంలోని అల్ అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడిలో 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. అయితే గాయపడ్డ వారికి చికిత్స అందించేందుకు వైద్యులు ఎన్నో బాధలు పడ్డారు. అనస్థీషియా లేకుండానే క్షతగాత్రులను నేలపై పడుకోపెట్టి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. 

దాడి తర్వాత వందలాది మృతదేహాలను చూశానని అల్ అహ్లీ ఆసుపత్రి సర్జన్ బాధతో చెప్పుకొచ్చాడు. చాలా మంది గాయపడ్డారని..వారంతా చికిత్స కోసం తమవైపు చూస్తుంటే తట్టుకోలేకపోయామన్నారు. కాలు తెగిపడిన వ్యక్తులు, మెడకు బలమైన గాయాలైన వారు ఎంతో మంది ఉన్నారని..వారికి చికిత్స చేసేందుకు సరైన పరికరాలు కూడా లేవన్నారు. కొందరికి ఆనెస్థీషియా ఇవ్వకుండానే సర్జరీ చేశామని వివరించారు. 

సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ సిటీ ఆసుపత్రిపై జరిగిన భారీ వైమానిక దాడిలో ఏకంగా 500 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 900 మంది గాయపడ్డారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకుపోయారు. దాడిలో ఆసుపత్రి పరిసరాలు భీతావహంగా మారిపోయాయి. ఆసుపత్రిలోని హాళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. రోగుల శరీరభాగాలు ఛిద్రమై చెల్లాచెదురుగా పడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

ALSO READ :  గాజాలో 500 మందిని చంపింది మీరు కాదు.. వాళ్లే : బైడెన్

ఆసుపత్రిపై దాడికి తాము బాధ్యులం కాదని రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిలే ఈ దాడికి పాల్పడిందని హమాస్ ఆరోపిస్తోండగా..దీనిని ఇజ్రాయెల్ సైన్యం ఖండించింది. దాడి చేసింది తాము కాదని..తాము ఆసుపత్రి సమీపంలో ఎలాంటి వైమానిక దాడులు జరపడం లేదని స్పష్టం చేసింది. ఇస్లామిక్ జిహాద్ మిలిటరీ గ్రూప్ రాకెట్ మిస్ ఫైర్ అయి ఆసుపత్రిపై పడిందని పాలస్తీనా మిలిటెంట్లను నిందించింది.