అటవీ ఉత్పత్తులతో ఆదాయం...ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి జీసీసీ చేయూత

అటవీ ఉత్పత్తులతో ఆదాయం...ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి జీసీసీ చేయూత
  •     ఏజెన్సీల్లో ముమ్మరంగా అటవీ ఉత్పత్తుల సేకరణ
  •     మద్దతు ధర అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 
  •     ఈ ఏడాది 1861 క్వింటాళ్ల అటవీ ఉత్పత్తుల సేకరణే లక్ష్యం

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: అడవులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులు, ఆదివాసీలు అటవీ ఉత్పత్తుల ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పొందుతున్నారు. జీసీసీ (గిరిజన సహకార సంస్థ) గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్‌‌‌‌‌‌మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ట్రైఫెడ్‌‌‌‌)తో ఒప్పందం కుదుర్చుకుని కనీస మద్దతు ధరకు జీసీసీల ద్వారా అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ జరుగుతోంది. వార్షిక లక్ష్యాల మేరకు కొనుగోళ్లు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సహజసిద్ధమైన అటవీ వనరుల సంరక్షణపై కూడా జీసీసీ ప్రత్యేక దృష్టి సారించింది.  

ప్రత్యామ్నాయ ఉపాధి..

అటవీ ఉత్పత్తుల సేకరణ గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధిగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పపువ్వుల సేకరణ అధికంగా జరుగుతుండగా, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో విషముష్టి కాయల సేకరణ పెరిగినట్లు జీసీసీ అధికారులు తెలిపారు. తెలంగాణలో అటవీ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ట్రైఫెడ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంతో, ఇప్పటివరకు కొనుగోళ్ల భారం మోస్తున్న జీసీసీలకు తోడ్పాటు లభిస్తోంది. దీంతో కొనుగోళ్ల ప్రక్రియ మరింత సులభమైందని అధికారులు చెబుతున్నారు.  

ముమ్మరంగా కొనుగోళ్లు..

జీసీసీ ఆధ్వర్యంలో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం జీసీసీ డివిజన్ పరిధిలో మహదేవపూర్, నర్సంపేట, నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా మన్ననూర్, ఏటూరునాగారం, ములుగు, వెంకటాపూర్ శాఖల ద్వారా గిరిజనులకు సేవలు అందిస్తున్నారు. ఈ ఆరు బ్రాంచీల ద్వారా ఈ ఏడాది 904.51 క్వింటాళ్ల ఇప్పపువ్వు, 247.23 క్వింటాళ్ల ఇప్పగింజలు, 470.46 క్వింటాళ్ల విషముష్టి గింజలు, 11 క్వింటాళ్ల కానుగ గింజలు, 40 క్వింటాళ్ల తేనె, 180 క్వింటాళ్ల కుంకుడు కాయలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా 1,861.20 క్వింటాళ్ల అటవీ ఉత్పత్తులను సేకరించి రూ.85.59 లక్షల విలువైన కొనుగోళ్లు చేపట్టాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇప్పటివరకు డివిజన్ పరిధిలో రూ.3.15 లక్షల విలువైన 4.10 క్వింటాళ్ల అటవీ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేసినట్లు జీసీసీ అధికారులు తెలిపారు. గతేడాది రూ.24.17 లక్షల విలువైన అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసినట్లు సమాచారం.

లక్ష్యం చేరుకునేనా..

ఈ ఏడాది కొనుగోలు లక్ష్యాలను చేరుకునేందుకు జీసీసీలు గిరిజనులు, ఆదివాసీలను నిరంతరం చైతన్యపరుస్తున్నాయి. ఇప్పపువ్వుల సేకరణలో 904.51 క్వింటాళ్ల టార్గెట్​ కాగా, ఇప్పటివరకు కేవలం 27.14 క్వింటాళ్లు మాత్రమే సేకరించారు. పూత సమయంలో గాలివానల వల్ల ఇప్పపువ్వులు, ఇప్పగింజల దిగుబడిపై ప్రభావం పడిందని గిరిజనులు చెబుతున్నారు. ఈ ఏడాది లక్ష్యాలను చేరుకోవడం కష్టసాధ్యమని అభిప్రాయపడుతున్నారు. అడవుల నరికివేత, పోడు సాగు విస్తరణ కారణంగా అడవుల విస్తీర్ణం తగ్గుతుండటంతో అటవీ ఉత్పత్తుల లభ్యత కూడా తగ్గిపోతోందని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

టార్గెట్ రీచ్ అయితాం.. 

ఏజెన్సీ గ్రామాల్లో అటవీ ఉత్పత్తుల సేకరణ పై క్యాంపులు నిర్వహించాం. టార్గెట్ మేరకు ఈ ఏడాది కొనుగోళ్లు ప్రక్రియ పూర్తి చేస్తాం. దళారుల నుంచి గిరిజనులు మోసం పోకుండా చర్యలు తీసుకుంటున్నాం. అటవీ వనరుల సంరక్షణతో ఉత్పత్తులు పెరిగేలా చొరవ తీసుకుంటున్నాం.  

- కుంజ వాణి, జీసీసీ డీఎం, ఏటురునాగారం