
సింగరేణి జీడీకే 11వ గనిలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో పులిపాక సమ్మయ్య (38) అనే జనరల్‌మజ్దూర్ కార్మికుడు చనిపోయాడు. గనిలో విద్యుత్ సరఫరా చేసేందుకు ట్రాన్స్ స్విచ్ యంత్రాన్ని మరో చోటికి తరలిస్తుండగా అదుపుతప్పి మిషన్ సమ్మయ్యపై పడింది. ఆ బరువుకు ఎముకలు విరిగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. వారసత్వంగా తండ్రి ఉద్యోగాన్ని 2015లో పొందిన సమ్మయ్య మూడేళ్లకే ప్రమాదవశాత్తు చనిపోయాడు. రామకృష్ణాపూర్‌లోని శ్రీనివాస నగర్‌లో ఉండే సమ్మయ్యకు భార్య సుశీల, ఇద్దరు కూతుళ్లు అరోమా, శృతి ఉన్నారు.
రక్షణ చర్యలు లేకనే…
జీడీకే 11వ గనిలో 4వ సీమ్‌లోని 81వ లెవల్‌లోని ట్రాన్స్‌స్విచ్ యంత్రాన్ని మరోచోటకు తరలించేందుకు నలుగురు జనరల్‌మజ్దూర్లు, నలుగురు బదిలీ వర్కర్లను నియమించిన అధికారులు.. ఈ ప్రక్రియ పరిశీలించేందుకు ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్‌ను నియమించలేదు. అందువల్లే రక్షణ చర్యలు లేక సమ్మయ్య చనిపోయాడని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శవాన్ని గని నుంచి బయటకు తేగా, టీబీజీకెఎస్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ తదితర సంఘాలకు చెందిన నాయకులతో పాటు కార్మికులు ఆందోళన చేపట్టారు. మైన్ సేఫ్టీ ఆఫీసర్, ఇతర బాధ్యుల మీద చర్యలు తీసుకునేదాకా శవాన్ని తరలించనివ్వమని అంబులెన్స్‌ను అడ్డుకున్నారు. కొద్దిసేపటికి చేరుకున్న ఆర్జీ 1 ఏరియా ఎస్‌ఓ టు జీఎం ఎం.త్యాగరాజు, పర్సనల్ డీజీఎం బి.హన్మంతరావు, ఏజంట్‌సాంబయ్య.. సంఘటనపై పూర్తి విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నెలరోజుల్లో మృతుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని, త్వరగా బెనిఫిట్స్ అందేలా చూస్తామనడంతో ఆందోళన విరమించారు. గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్లో పోస్ట్‌మార్టమ్ నిర్వహించి శవాన్ని బంధువులకు అప్పగించారు.
ఎమ్మెల్యే పరామర్శ…
సమ్మయ్య కుటుంబసభ్యులను సింగరేణి ఏరియా హాస్పిటల్ వద్ద రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్‌ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి, ఇతర కార్మిక సంఘాల నేతలు పరామర్శించారు. రక్షణ చర్యల్లో యాజమాన్యం విఫలమైందని, ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.