వీర సైనికుడు, మంచి మనిషిని కోల్పోయాం: విదేశీ రాయబారుల నివాళి

వీర సైనికుడు, మంచి మనిషిని కోల్పోయాం: విదేశీ రాయబారుల నివాళి

హెలికాప్టర్‌‌ ప్రమాదంలో మరణించిన భారత చీఫ్ ఆఫ్‌ డిఫెన్స్ స్టాఫ్‌ జనరల్ బిపిన్ రావత్‌కు పలు దేశాల రాయబారులు ఘన నివాళి అర్పించారు. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, భూపాన్, నేపాల్‌కు చెందిన సైన్యాధిపతులు, కమాండర్లు ఢిల్లీ చేరుకుని బిపిన్‌కు నివాళి అర్పించారు. అలాగే బ్రిటన్, ఫ్రాన్స్, శ్రీలంక దేశాల రాయబారులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

బిపిన్.. శ్రీలంకకు మంచి మిత్రుడు

సీడీఎస్ బిపిన్ రావత్ మృతి అతి పెద్ద విషాదమని శ్రీలంక హైకమిషనర్ మిలిందా మోరగోడ అన్నారు. తమ దేశం తరఫున సీడీఎస్, ఆర్మీ కమాండర్లను బిపిన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తమ దేశాధ్యక్షుడు పంపినట్లు తెలిపారు. బిపిన్ మృతి తమ హృదయాలను కలచివేసిందని, తమ దేశ మిలటరీలో చాలా మంది సీనియర్స్‌కు ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని మిలిందా చెప్పారు. బిపిన్ శ్రీలంకకు మంచి స్నేహితుడని అన్నారు.

జాయింట్ డిఫెన్స్ అప్రొచ్‌ మొదలుపెట్టింది ఆయనే

బిపిన్ రావత్ మృతి తమను ఎంతో బాధించిందని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎలిస్ అన్నారు. జాయింట్‌ డిఫెన్స్ అప్రోచ్‌ను మొదలుపెట్టందే ఆయన అని అన్నారు. అటువంటి గొప్ప నాయకుడు, వీర సైనికుడు, మంచి మనిషిని కోల్పోవడం భారత్‌కు తీరని లోటు అని అలెక్స్ చెప్పారు. రక్షణ రంగంలో యూకే, భారత్ మధ్య బంధాన్ని బలోపేతం చేయడంలో బిపిన్ చాలా కీలక పాత్ర పోషించారని అన్నారు. బిపిన్ సహా ఈ ప్రమాదంలో మరణించిన వారందరినీ తమకు అత్యంత ఆప్తులుగా భావిస్తున్నామని, వారి లోటు రెండు దేశాలకూ నష్టమేనని అన్నారు.

గొప్ప మిలటరీ లీడర్

బిపిన్ రావత్‌ మృతి పట్ల ఫ్రాన్స్ రాయబారి ఎమాన్యుయేల్ లెనైన్ సంతాపం తెలిపారు. ఆయనను ఒక గొప్ప మిలటరీ లీడర్‌‌గా, తమ దేశానికి మంచి స్నేహితుడిగా ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. ఇరు దేశాల మధ్య మంచి సంబంధాల కోసం కృషి చేసిన వ్యక్తిగా ఆయన నిలిచిపోతారని అన్నారు.