శత్రువు మరణాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు

శత్రువు మరణాన్ని సెలబ్రేట్ చేసుకోకూడదు

హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల చీఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌ మృతిపై పాక్ ఆర్మీ సైతం స్పందించింది. దాయాది దేశ ఆర్మీ చీప్​ జావెద్ బజ్వా సంతాపం తెలిపారు. దీనిపై  పాక్ ఆర్మీ అధికారిక ప్రతినిధి ట్విట్టర్‌‌లో పోస్ట్ చేశారు. అయితే భారత వీర పుత్రుడి మరణంపై మన ఆర్మీ మాజీ బ్రిగేడియర్ ఆర్ఎస్‌ పఠానియా నివాళి అర్పిస్తూ  చేసిన ట్వీట్‌కు పాక్ ఆర్మీ మాజీ మేజర్ స్పందించారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా భావోద్వేగభరితంగా సంభాషణ సాగింది.

శత్రువు మరణాన్ని సెలబ్రేట్ చేసుకోకు

సీడీఎస్ బిపిన్ రావత్ ఫొటోతో ‘సెల్యూట్ సర్.. జైహింద్’ అంటూ రిటైర్డ్ బ్రిగేడియర్ ఆర్ఎస్ పఠానియా ట్వీట్ చేశారు. దీనికి పాక్ ఆర్మీ మాజీ మేజర్ ఆదిల్ రాజా సంతాపం తెలుపుతూ రిప్లై ఇచ్చారు. తాను హృదయపూర్వకంగా సంతాపం తెలుపుతున్నానని, దీనిని యాక్సెస్ట్ చేయండి ప్లీజ్ అని ఆదిల్ ట్వీట్ చేశారు. దీనికి ‘థ్యాంక్యూ ఆదిల్.. ఒక సైనికుడి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది ఇదే.. సెల్యూట్’ అంటూ పఠానియా ప్రతిస్పందించారు. అవును సర్.. ఒక సోల్జర్‌‌గా ఎవరైనా ఇదే చేయాలంటూ బిపిన్ మృతికి మరోసారి ఆదిల్ విచారం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పంజాబీలో ఓ సామెతను చెప్పారు. ‘దుష్మన్ మరేతో కుషియా నా మనావో, కద్దాయ్‌ సజ్నా వీ మర్‌‌ జానా” అని ఆదిల్‌ ట్వీట్ చేశారు. దీని అర్థం శత్రువు మరణాన్ని  సెలబ్రేట్ చేసుకోకు.. ఏదో ఒక రోజు నీ మిత్రుడు కూడా మరణిస్తాడు అని ఆయన ఆ ట్వీట్‌లో వివరించారు. 

మనం యుద్ధ భూమిలోనే శత్రువులం..

ఆదిల్ కామెంట్‌కు మరింత మానవతా దృక్పథాన్ని చాటేలా ఆర్‌‌ఎస్ పఠానియా స్పందించారు. ‘‘థ్యాంక్యూ ఆదిల్.. నాకు పంజాబీ అర్థమవతుంది. నేను పంబాబీలో బాగా మాట్లాడగలను కూడా. అయితే మనం యుద్ధ భూమిలోనే శత్రువులం.. మిగతా సమయంలో మన స్నేహితులుగా ఉండలేకపోయినా కనీసం మామూలు మనుషుల్లా ఉందాం” అని ట్వీట్ చేశారు. అయితే ఈ విషయంలో తాను పూర్తి అంగీకరించలేకపోయినప్పటికీ శాంతియుతంగా ముందుకెళ్లడం ఒక్కటే మార్గమని ఆదిల్ అన్నారు.