
- ముందుగా నర్సాపూర్, మెదక్ మండలాల్లో అమలు
- ఇప్పటికే శిక్షణ పూర్తిచేసిన ఎస్ హెచ్ జీ గ్రూప్‌ల మహిళలు
మెదక్, వెలుగు: మహిళల పట్ల వివక్ష, బాల్య వివాహాలు, అంటరానితనం తదితర సామాజిక సమస్యల పరిష్కారాల కోసం ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల (ఎస్ హెచ్ జీ) మహిళలతో జెండర్కమిటీల ఏర్పాటును ప్రారంభించింది. రాష్ట్రంలో పైలెట్ప్రాజెక్ట్గా మెదక్జిల్లాను ఎంపిక చేసింది. ఇప్పటికే నర్సాపూర్, మెదక్ మండలాల్లో జెండర్ కార్యక్రమాలను ప్రారంభించారు.
ఆయా మండలాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ కూడా పూర్తయింది. ఈ కమిటీల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లలో విద్యావంతులు, బాగా మాట్లాడే మహిళలను ఎంపిక చేశారు. ఈ కమిటీలు సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాయి. దశల వారీగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
సమాజంలో సమానత్వం కోసం..
స్వయం సహాయక సంఘాల్లో సామాజిక ఎజెండా అమలు చేయడానికి గ్రామ సంఘాల్లో, మండల సమాఖ్యల్లో, జిల్లా సమాఖ్యల్లో జెండర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్‌హెచ్‌జీలో సభ్యురాలై ఉండి 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు, కనీసం పదో తరగతి విద్యార్థత, స్పష్టంగా చదివే, రాయగలిగే నైపుణ్యం ఉండి, నాయకత్వ లక్షణాలు, కుల, మత బేధాలు పాటించని, ఇదివరకు జెండర్ అంశాల్లో చురుకుగా పనిచేసిన వారిని సోషల్ యాక్షన్ కమిటీల్లో నియమిస్తారు.
వారిని జెండర్ పాయింట్ పర్సన్ గా ఎంపిక చేస్తారు. వీరిని జెండర్ సఖి అని పిలుస్తారు. పేదరిక నిర్మూలనలో భాగంగా కుటుంబాల్లో హింసను నివారించడానికి, కుటుంబంలో, సమాజంలో సమానత్వం సాధించడానికి ఈ కమిటీల సభ్యులు కృషి చేస్తారు.
సోషల్ యాక్షన్ కమిటీ బాధ్యతలు
గ్రామ స్థాయిలో ఏర్పాటైన సోషల్యాక్షన్ కమిటీలో ఆరుగురు సభ్యులు ఉంటారు. హింసలేని కుటుంబాలు, బాల్యవివాహాలను అరికట్టడం, బాలకార్మికులు లేని గ్రామంగా రూపొందించడం, బాలికల విద్యకు ప్రోత్సాహం, అంటరానితనం నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, మద్యపాన నిషేధం, మూడ నమ్మకాల వ్యతిరేక వంటి కార్యక్రమాలను ఈ కమిటీలు నిర్వహిస్తాయి. గ్రామంలో వచ్చిన గృహ హింస కేసులను, కుటుంబ వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించాలి.
జనన, మరణాలు, పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలి. బాల్య వివాహాలు కట్టడి చేయాలి. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు జరిగేలా చూడాలి. యూనిఫార్మ్స్, పుస్తకాలు, ఆట వస్తువులు పిల్లలందరికీ సక్రమంగా అందుబాటులో ఉన్నాయో లేదో గమనించాలి. మద్యపానం వల్ల కలిగే నష్టాలను గురించి అవగాహన కల్పించాలి. డీ అడిక్షన్ సదుపాయాల గురించి తెలియజేసి అందు బాటులోకి తేవాలి.
దశల వారీగా జిల్లా అమలు
జెండర్ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్రంలో మెదక్ జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ముందుగా నర్సాపూర్, మెదక్ మండలాలను ఎంపిక చేసి అక్కడ జెండర్ వ్యవస్థను ఏర్పాటు చేసి, శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేశాం. అనంతరం దశల వారీగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసి నిర్ధేశిత కార్యక్రమాలను అమలు చేస్తాం.- శ్రీనివాస్ రావు, డీఆర్డీవో, మెదక్ జిల్లా
జిల్లాలో సంఘాల వివరాలు
మండలాలు: 21
వీవో లు: 52
నార్మల్ ఎస్‌హెచ్‌జీలు: 13,084
పీడబ్ల్యూడీ ఎస్‌హెచ్‌జీలు: 172
మొత్తం ఎస్‌హెచ్‌జీలు: 13,256
మొత్తం సభ్యులు: 1,37,239