పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ రెడీ చేయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

పాలమూరు ప్రాజెక్టు డాక్యుమెంట్లన్నీ రెడీ చేయండి.. ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  • ప్రతి అంశంపై ఆధారాలతో నివేదిక రూపొందించాలి
  • ఇరిగేషన్ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  • ప్రాజెక్టు సోర్స్‌‌ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారు? 
  • మన భూభాగంలోనే ఉంటే ఎలాంటి లొల్లి ఉండేది కాదు కదా!
  • కేవలం 45 టీఎంసీలు చాలంటూ లేఖలో మనమెక్కడ రాసినం? 
  • సెకండ్ ​ఫేజ్‌‌లో మిగతా 45 టీఎంసీలూ వాడుకుంటామని స్పష్టంగా చెప్పాం 
  • కృష్ణా జలాలపై కేసీఆర్​ చేసిన తప్పులన్నింటినీ అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టేలా రిపోర్టు రెడీ చేయాలని స్పష్టీకరణ

హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ఎస్‌‌కు దీటుగా బదులిచ్చేలా అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసి పెట్టుకోవాలని ఇరిగేషన్​ శాఖ అధికారులను సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్సును ఎందుకు మార్చారు? జూరాల నుంచి ప్రతిపాదించిన ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చడానికి కారణాలేంటి? అని అధికారులను ఆయన ప్రశ్నించారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాల్లో వాటాలు తదితర అంశాలపై ఇరిగేషన్​శాఖ అధికారులతో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీనికి ఇరిగేషన్​శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అంశంపైనా జనవరి ఒకటో తేదీ సాయంత్రం లోపు స్టేటస్​ రిపోర్టు సిద్ధం చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

‘‘జూరాల నుంచి పాలమూరు ప్రాజెక్టును చేపట్టి ఉంటే, అది తెలంగాణ భూభాగంలోనే ఉండేది కదా! ఎలాంటి అడ్డంకులు, ఇంటర్​స్టేట్​లొల్లి లేకుండా ప్రాజెక్టును పూర్తి చేసుకునేవాళ్లం.. నీళ్లను వాడుకునేవాళ్లం. జూరాల నుంచే శ్రీశైలానికి వరద ప్రవాహం వెళ్తుంది. అలాంటప్పుడు అవే వరద జలాలను జూరాల వద్దే వాడుకుంటే మేలు జరిగి ఉండేది కదా! వరద రోజుల్లో రోజూ 3 టీఎంసీల చొప్పున 25 రోజుల పాటు లిఫ్ట్​చేసుకున్నా 75 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకుని ఆయకట్టుకు నీళ్లందించేవాళ్లం. అంతేగాకుండా శ్రీశైలంతో పోలిస్తే జూరాల నుంచి ప్రాజెక్టును నిర్మించి ఉంటే లిఫ్టింగ్​ఎత్తు కూడా వంద మీటర్ల దాకా తగ్గి ఉండేది కదా?” అని అధికారులను సీఎం రేవంత్ ప్రశ్నించినట్టు తెలిసింది.

ఆ రిపోర్టులు బయటకు తియ్యండి..  
పాలమూరు ప్రాజెక్టుకు సంబంధించి జారీ చేసిన జీవోలు, ప్రాజెక్టు సోర్సు మార్పు తదితర అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించినట్టు తెలిసింది. ప్రాజెక్ట్​ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం, ఆ తర్వాత ఇచ్చిన రివైజ్డ్​ఎస్టిమేట్స్, రిజర్వాయర్లు, పంపుల నిర్మాణం, కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల తవ్వకం, పరిహారం చెల్లింపులు, భూసేకరణ సహా అన్ని వివరాలు డీటెయిల్డ్‌‌‌‌‌‌‌‌గా ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. ‘‘ప్రాజెక్టు పనుల ప్రారంభానికి ముందు డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిపుణుల కమిటీ చేసిన స్టడీ రిపోర్టులను బయటకు తియ్యండి. ఆ సమయంలో నిపుణుల కమిటీ ఏం చెప్పిందనే దానిపై నివేదిక తయారు చేయండి. ప్రాజెక్టు డీపీఆర్​వాస్తవంగా బీఆర్ఎస్​అధికారంలో ఉన్నప్పుడే వెనక్కి వచ్చింది. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం స్పందించలేదు.

ఇక ఈ ప్రాజెక్టుకు 45 టీఎంసీలు చాలంటూ ఎక్కడా లేఖలో మనం రాయలేదు. ఫస్ట్​ఫేజ్‌‌‌‌‌‌‌‌లో మైనర్​ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌లో వాడుకోని 45 టీఎంసీలను వాడుకుంటామని, గోదావరి డైవర్షన్‌‌‌‌‌‌‌‌లో వచ్చే మరో 45 టీఎంసీలను ట్రిబ్యునల్ అవార్డు అయిపోయాక రెండో ఫేజ్‌‌‌‌‌‌‌‌లో వాడుకుంటామని లేఖలో స్పష్టంగా రాశాం. అలాంటప్పుడు బీఆర్ఎస్​వాళ్లు 45 టీఎంసీలకే లెటర్​రాశారని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు. ఈ రెండు అంశాలపై ఎందుకు ప్రతిపక్షానికి గట్టిగా కౌంటర్​ఇవ్వలేకపోతున్నాం” అని అధికారులను సీఎం రేవంత్​ ప్రశ్నించినట్టు తెలిసింది. 

నీళ్ల కేటాయింపులపై కొట్లాడుతున్నదే మనం..
ప్రాజెక్టులకు నీళ్ల కేటాయింపులపై మొదటి నుంచి కొట్లాడుతున్నది తమ​ప్రభుత్వమేనని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. ‘‘బచావత్​ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాలను పునఃపంపిణీ చేసే సెక్షన్ 3 ఫర్దర్​టర్మ్స్​2023లోనే వచ్చాయి. ఫర్దర్​టర్మ్స్​ను కేంద్రం ఇవ్వకుండా లేట్​చేసిందే కేసీఆర్. ఈ విషయాన్ని ధ్రువీకరించే ఆధారాలు, లెటర్లను బయటకు తియ్యండి. 

299 టీఎంసీలకు ఒప్పుకున్నట్టు అప్పటి పాలకులు సంతకాలు చేసిన లేఖలు, అపెక్స్​ కౌన్సిల్​మీటింగ్​మినిట్స్​ తదితర రికార్డులను తీసి పూర్తి నివేదిక ఇవ్వండి” అని అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. కృష్ణా జలాలపై కేసీఆర్​చేసిన తప్పులన్నింటినీ అసెంబ్లీలో ఆధారాలతో సహా బయటపెట్టేలా డాక్యుమెంట్లు సిద్ధం చేయాలని స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎక్కడా తప్పుకు తావివ్వొద్దని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌‌.. దేశ ప్రజల గళం: సీఎం రేవంత్‌‌.. 140 ఏండ్ల పార్టీ ప్రస్థానంపై ‘ఎక్స్‌‌’లో ట్వీట్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌‌ పార్టీ దేశ ప్రజల గళం అని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు. 140 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున భారత ప్రజల పక్షాన నిలిచే ఒక శక్తిగా పురుడుపోసుకున్నదని తెలిపారు.  జాతీయ కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్‌‌రెడ్డి ‘ఎక్స్’లో  ట్వీట్​ చేశారు.  కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం భారత ప్రజాస్వామ్య గమనానికి అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు. ‘‘సోనియా గాంధీ నాయకత్వంలో  సేవ, అంకితభావం, నైతికత, విలువలు కనిపిస్తాయి. ఆమె నాయకత్వంలోనే తెలంగాణలోని ఒక మారుమూల గ్రామం నుంచి తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన పీవీ నరసింహారావు  దేశ ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు” అని అన్నారు.