
- టెర్రర్ భూతాన్ని ఖతం చేయాల్సిందే
- మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ డిమాండ్
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) ను స్వాధీనం చేసుకోవాలని మజ్లిస్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. పాకిస్తాన్ మద్దతు ఇస్తున్న ఉగ్ర కార్యకలాపాలకు ఎట్టి పరిస్థితుల్లోనైనా అంతం చేయాలని కేంద్రాన్ని ఆయన కోరారు. పీవోకేలోకి చొరబడి టెర్రరిస్టులను మట్టుబెడతామని బీజేపీ చెబుతోందని, అదొక్కటే చేస్తే చాలదని, పీవోకేను స్వాధీనం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. గురువారం ఓ వార్తా సంస్థతో ఒవైసీ మాట్లాడారు.
పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ ప్రతిదాడులు చేస్తుందని తెలిసి పీవోకేలో పాకిస్తాన్ తమ టెర్రర్ లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేస్తున్నదని చెప్పారు. వారు (పాక్) పీవోకే నుంచి వెళ్లిపోతే, మనం అక్కడికెళ్లి పీవోకేను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పీవోకే భారత్ దే అని పార్లమెంటు తీర్మానం చెబుతోందని గుర్తుచేశారు. ‘‘గతంలో హైదరాబాద్ లో లుంబిని, దిల్ సుఖ్ నగర్ లో పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లలో నాకు తెలిసిన శర్మ అనే వ్యక్తి కూతురు చనిపోయింది.
ఇప్పటికీ శర్మాజీ నన్ను కలిసి ఎంతో బాధపడుతుంటారు. అలాగే, 26/11 దాడుల్లో నిజామాబాద్ కు చెందిన ఓ పెండ్లికూతురు ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో ప్రాణాలు కోల్పోయింది. తర్వాత పఠాన్ కోట్, రియాసీ, యురీ, పుల్వామాలో ఉగ్ర దాడులు జరిగాయి. మళ్లీ పహల్గాంలో అటాక్ జరిగింది. ఇక ఇలాంటివి జరగరాదు. ఎట్టి పరిస్థితుల్లో అయినా టెర్రరిజంను అంతం చేయాల్సిందే. ప్రతిపక్షాలు కూడా ఇదే కోరుకుంటున్నయి’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు. ఇక, తమ వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని బెదిరిస్తున్న పాకిస్తాన్ నేతలపైనా ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. భారత్ లోకి ప్రవేశించి మన ప్రజలను చంపితే, ఇండియా ఊరికే కూర్చోదని, ఈ విషయాన్ని పాక్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. శత్రు దేశం ఐఎస్ టెర్రరిస్టుల్లా ప్రవర్తించిందని ఫైర్ అయ్యారు.