హైదరాబాద్ SR నగర్ హాస్టల్స్ పై అధికారుల దాడులు : 15 హాస్టల్స్ కు భారీగా జరిమానా

హైదరాబాద్ SR నగర్ హాస్టల్స్ పై అధికారుల దాడులు : 15 హాస్టల్స్ కు భారీగా జరిమానా

హైదరాబాద్ సిటీలోని బాయ్స్ అండ్ లేడీస్ ప్రైవేట్ హాస్టల్స్ పై దాడులు చేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఎక్కడపడితే అక్కడ.. ఎలా పడితే అలా నిర్వహిస్తున్న హాస్టల్స్ ను తనిఖీ చేస్తున్నారు సిబ్బంది. బృందాలుగా ఏర్పడిన జీహెచ్ఎంసీ అధికారులు.. సిటీ నడిబొడ్డున ఉన్న SR నగర్ లోని హాస్టల్స్ లో తనిఖీలు చేశారు.

హాస్టల్ నిర్వహించాలంటే లేబర్ యాక్ట్ కింద లైసెన్స్ తీసుకోవాలి.. ఫుడ్ సేఫ్టీ కింద లైసెన్స్ తీసుకోవాలి. దాదాపు ఏ హాస్టల్ కూడా ఇలాంటి అనుమతులు తీసుకోవటం లేదని గుర్తించారు అధికారులు. దీంతో ఎస్సార్ నగర్ లోని 15 హాస్టల్స్ కు భారీగా జరిమానా విధించారు. ఆయా హాస్టల్స్ లో తయారు అవుతున్న ఫుడ్ పరిశీలించారు. కిచెన్ ఎలా ఉంది.. శుభ్రత పాటిస్తున్నారా అనేది చెక్ చేశారు. వంట కోసం ఉపయోగిస్తున్న ఆయిల్స్, నిత్యావసర సరుకుల నాణ్యతను పరిశీలించారు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు.

లైసెన్స్ లేని హాస్టల్స్ కు జరిమానా విధించటంతోపాటు.. ఇక నుంచి అన్ని అనుమతులు రెగ్యులర్ గా తీసుకోవాలని హెచ్చరించారు. మరోసారి తనిఖీల్లో దొరికితే కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు అధికారులు. భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఎస్సార్ నగర్ లోని హాస్టల్స్ పై అధికారుల దాడుల సమాచారంతో.. సిటీలోని చాలా ఏరియాల్లోని హాస్టల్స్ నిర్వహకులు అప్రమత్తం అయ్యారు. వారి వారి కిచెన్ ను శుభ్రం చేసుకుంటున్నారు. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ ఏరియాల్లో అయితే వేల సంఖ్యలో ఉన్న హాస్టల్స్ పైనా ఇప్పటికే నిఘా పెట్టారు అధికారులు.