Ganesh Nimajjanam 2025: రూ. 30 కోట్లతో గణేశ్ నిమజ్జనోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ ఎంసీ

Ganesh Nimajjanam 2025:  రూ. 30  కోట్లతో గణేశ్ నిమజ్జనోత్సవాలు.. ఏర్పాట్లు చేస్తున్న జీహెచ్ ఎంసీ
  • 74  పాండ్స్​తో పాటు పలు చెరువుల్లో నిమజ్జనాలు
  •  వీటిలో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్
  •  24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్
  •  23 టెంపరరీ ఎక్సావేషన్ పాండ్స్
  •  శోభాయాత్ర జరిగే ప్రాంతాల్లోరోడ్ల రిపేర్లు
  •   ఆగస్టు 19  నిమజ్జనం ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమావేశం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​లో రూ.30 కోట్లతో గణేశ్ నిమజ్జనోత్సవాలకు బల్దియా ఏర్పాట్లు చేస్తున్నది. మొత్తం 74 పాండ్స్ ఏర్పాటు చేయనుండగా, వీటిలో 27 పర్మినెంట్ బేబీ పాండ్స్, 24 టెంపరరీ పోర్టబుల్ పాండ్స్, 23 కృత్రిమ కొలనులు (టెంపరరీ ఎక్సావేషన్) ఉన్నాయి. చెరువుల వద్ద కూడా నిమజ్జన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 5 అడుగుల కంటే తక్కువ ఎత్తున్న విగ్రహాలను సర్కిళ్ల వారీగా బేబీ పాండ్స్​లో నిమజ్జనం చేసేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.

 హుస్సేన్​సాగర్​లో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిమజ్జనం చేయనున్నారు. ఇప్పటికే  హుస్సేన్​సాగర్ వద్ద లైటింగ్ పనులు మొదలయ్యాయి. బారికేడ్లు, క్రేన్లు, శోభాయాత్ర కొనసాగే18 కి.మీ. మేర రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నారు. వినాయక చవితి ఈ నెల 27న ఉండగా, మూడో రోజు నుంచి విగ్రహాల నిమజ్జనం ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 6న చివరి రోజు నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో నిమజ్జన ఏర్పాట్లపై హైదరాబాద్ ఇన్‌‌‌‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు మర్రి చెన్నారెడ్డి కేంద్రంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు హాజరుకానున్నారు. 

ఎక్కడివారు అక్కడే నిమజ్జనం చేసేలా..

జీహెచ్‌‌‌‌ఎంసీ పరిధిలో గణేశ్ నిమజ్జనం కోసం కాప్రా ఊరచెరువు, చర్లపల్లి ట్యాంక్, సరూర్​నగర్ మినీ ట్యాంక్ బండ్, కూకట్‌‌‌‌పల్లి పరిధిలోని అంబీర్ చెరువు, రంగధాముని కుంట, ఐడీఎల్ లేక్, శేరిలింగంపల్లి గంగారం పెద్ద చెరువు, జీడిమెట్ల వెన్నల చెరువు, రాయదుర్గ్ మల్కం చెరువు, దుర్గంచెరువు, నల్లగండ్ల చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువు, నెక్నాంపూర్ పెద్దచెరువు, సూరారం లింగంచెరువు, మూసాపేట ముళ్లకత్వ చెరువు, నాగోల్ చెరువు, అల్వాల్ కొత్తచెరువు, ఉప్పల్ నల్లచెరువు, రాజేంద్రనగర్ పత్తికుంట, హస్మత్​పేట బోయిన్ చెరువు, మియాపూర్ గురునాథ్ చెరువు, లింగంపల్లి గోపిచెరువు, రాయసముద్రం చెరువు, హఫీజ్​పేట కైదమ్మకుంటతో పాటు మరిన్ని చెరువుల వద్ద నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నారు. మండపాల సమీపంలోని పాండ్స్​లో ఆయ విగ్రహాల నిమజ్జనం జరిగేలా జీహెచ్‌‌‌‌ఎంసీ చర్యలు తీసుకుంటోంది.

సగానికిపైగా హుస్సేన్​సాగర్​కే

గ్రేటర్ వ్యాప్తంగా దాదాపు 3 లక్షలకు పైగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం జరగనుంది. ఇందులో సగానికిపైగా హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం కోసం రానున్నాయి. ఏటా 40కిపైగా క్రేన్​లు ఏర్పాటు చేసినా..  నిమజ్జనం కోసం 6 నుంచి-10 గంటల సమయం పడుతోంది. మరుసటి రోజు సాయంత్రం వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. ఈసారి ఆ ఇబ్బందులు తప్పించేందుకు అదనపు క్రేన్​లు ఏర్పాటు చేయాలని ఉత్సవ సమితి సభ్యులు కోరుతున్నారు.