- ఎస్సీలకు 17 మున్సిపల్ చైర్పర్సన్లు, ఒక మేయర్
- ఎస్టీలకు 5 మున్సిపల్ చైర్పర్సన్లు, ఒక మేయర్
- డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు
- -121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు గెజిట్ విడుదల చేసిన సర్కారు
- ఏ స్థానం ఏ వర్గానికో ఈ నెల 17న క్లారిటీ
- ఈ నెల 20 తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే చాన్స్
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకే అగ్రతాంబూలం దక్కింది. కీలకమైన మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్, వార్డులు, డివిజన్ల రిజర్వేషన్లలో బీసీలకే ఎక్కువ స్థానాలు దక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో ఏకంగా 38 చైర్పర్సన్ స్థానాలు, 10 కార్పొరేషన్లలో 3 మేయర్ స్థానాలు బీసీ సామాజిక వర్గానికే దక్కడం విశేషం.
బీసీ రిజర్వేషన్ల కోసం ప్రత్యేకంగా నియమించిన 'డెడికేటెడ్ కమిషన్' సమర్పించిన నివేదికతో పాటు 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మున్సిపల్అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్(ఎంఏయూడీ) గెజిట్ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 121 మున్సిపాలిటీల్లో బీసీలకు కేటాయించిన 38 స్థానాల్లో జనరల్ కోటా కింద 19 స్థానాలు, మహిళా కోటా కింద 19 స్థానాలు సమానంగా దక్కాయి. బీసీల తర్వాత జనరల్ మహిళల విభాగంలో 31 మున్సిపాలిటీలను, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 30 స్థానాలను కేటాయించారు.
ఇక 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన ఎస్సీలకు 17 స్థానాలు (జనరల్-9, మహిళ-8), ఎస్టీలకు 5 స్థానాలు (జనరల్-3, మహిళ-2) రిజర్వ్ అయ్యాయి. మరోవైపు రాష్ట్రంలోని 10 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పీఠాల్లోనూ బీసీలకు 3 మేయర్ స్థానాలు దక్కగా, అందులో 2 జనరల్ అభ్యర్థులకు, 1 మహిళకు కేటాయించారు. కాగా, కార్పొరేషన్లలో అత్యధికంగా జనరల్ మహిళల (ఉమెన్) కు నాలుగు స్థానాలు దక్కడం విశేషం.
మిగిలిన స్థానాల్లో ఎస్సీలకు 1, ఎస్టీలకు 1 చొప్పున మేయర్ పీఠాలు రిజర్వ్ కాగా, కేవలం ఒక్క కార్పొరేషన్ మాత్రమే అన్ రిజర్వ్డ్ (జనరల్) ఖాతాలోకి వెళ్లింది. ఏ మున్సిపల్ చైర్మెన్, ఏ కార్పొరేషన్ మేయర్ పీఠం, ఏ వార్డు ఎవరి రిజర్వేషన్ అనేది 17న ఖరారు చేయనున్నారు. దీంతో ఈ నెల 20 తరువాత ఎప్పుడైనా మున్సిపల్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వార్డుల్లోనూ బీసీల జోరు..
ఇక వార్డుల విషయానికి వస్తే.. జిల్లాల వారీగా ప్రధాన మున్సిపాలిటీల్లో బీసీ కౌన్సిలర్ల సంఖ్య భారీగా ఉంది. ఉదాహరణకు జగిత్యాల జిల్లాలోని జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా, అందులో ఏకంగా 20 స్థానాలను జనరల్-10, మహిళ-10 బీసీలకే కేటాయించారు. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలోని 43 వార్డుల్లో 17 వార్డులు, నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని 48 వార్డుల్లో 16 వార్డులు, ఆదిలాబాద్‌లోని 49 వార్డుల్లో 15 వార్డులు బీసీలకే రిజర్వ్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 36 వార్డులకు గాను 14 స్థానాలు, భువనగిరిలో 35 వార్డులకు 11 స్థానాలు బీసీల ఖాతాలో చేరాయి. ఇలా దాదాపు ప్రతి మున్సిపాలిటీలోనూ బీసీలకు గణనీయమైన సంఖ్యలో వార్డులు దక్కాయి.
వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల లెక్కలను కూడా ప్రభుత్వం పక్కాగా పొందుపరిచింది. బెల్లంపల్లి వంటి ఏజెన్సీ, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఎస్సీలకు ప్రాధాన్యం దక్కింది. బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో 10 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, ఇల్లందు వంటి మున్సిపాలిటీల్లో ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం సీట్లు కేటాయించారు. ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికి వస్తే, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళా కోటాతో పాటు, 'జనరల్ మహిళ' కోటా కింద కూడా భారీగా వార్డులను కేటాయించారు.
మహబూబ్నగర్కార్పొరేషన్లో బీసీలకు 43శాతం
మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్ కార్పొరేషన్లలో బీసీలకు అత్యధిక వార్డులు దక్కాయి. ముఖ్యంగా మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌లో ఉన్న 60 వార్డుల్లో ఏకంగా 26 వార్డులు బీసీలకే కేటాయించడంతో అక్కడ అత్యధికంగా 43.33 శాతం రిజర్వేషన్లు , జీహెచ్‌ఎంసీలో 300 డివిజన్లకు గాను 122 స్థానాలు (40.66 శాతం), నిజామాబాద్‌లో 60 వార్డులకు 24 స్థానాలు (40 శాతం) బీసీల పరమయ్యాయి. ఇక ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయానికి వస్తే.. జనాభా ప్రాతిపదికన రామగుండం (పెద్దపల్లి) కార్పొరేషన్‌లో ఎస్సీలకు అత్యధిక ప్రాధాన్యం దక్కింది.
అక్కడ 60 వార్డుల్లో 13 స్థానాలను (21.66 శాతం) ఆ వర్గానికి కేటాయించారు. అలాగే ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎస్టీలకు సింహభాగం దక్కింది; ఇక్కడ మొత్తం 60 వార్డుల్లో 11 స్థానాలు (18.33 శాతం) గిరిజనులకే రిజర్వ్ కావడం, ఇదే కార్పొరేషన్‌లో ఎస్సీలకు కూడా 20 శాతం (12 సీట్లు) రిజర్వేషన్ దక్కడం విశేషం.
సగం సీట్లు మహిళలకే..
జనరల్ మహిళల కోటాలోని 788 సీట్లతో పాటు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల్లోని మహిళా రిజర్వేషన్లను కూడా కలుపుకుంటే.. మొత్తం 2,704 వార్డుల్లో సుమారు 1,335 వార్డులు (బీసీ మహిళలు-345, ఎస్సీ మహిళలు-167, ఎస్టీ మహిళలు-35, జనరల్ మహిళలు-788) మహిళలకే రిజర్వ్ అయ్యాయి.
బీసీలకు763 వార్డులు
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 2,704 వార్డులు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన, డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ వార్డులను వివిధ సామాజిక వర్గాలకు కేటాయించారు. ఇందులో మొత్తం 2,704 వార్డులకు గాను సింహభాగం సీట్లు బీసీల పరమయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో జనరల్ మహిళలు, అన్రిజర్వ్డ్ అభ్యర్థులు నిలిచారు. బీసీలకు అత్యధికంగా 763 వార్డులు దక్కాయి. జనాభా ప్రాతిపదికన 400 వార్డులను ఎస్సీలకు కేటాయించారు. 175 వార్డులు ఎస్టీ సామాజిక వర్గానికి దక్కాయి. ఎటువంటి సామాజిక వర్గ నిబంధన లేకుండా కేవలం మహిళలకు కేటాయించిన సీట్లు 788 ఉన్నాయి.అన్రిజర్వ్డ్ (జనరల్) ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయగలిగే అన్రిజర్వ్డ్ స్థానాలు 575 ఉండడం గమనార్హం.
రిజర్వేషన్లు ఇలా..
121 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు..
బీసీ 38 (మహిళ 19,జనరల్ 19)
ఎస్సీ 17 (మహిళ 8,జనరల్9)
ఎస్టీ 05 (మహిళ 2,జనరల్ 3)
జనరల్ మహిళ 31
అన్రిజర్వ్డ్ 30
10 కార్పొరేషన్లలో మేయర్ల రిజర్వేషన్లు..
బీసీ 03
ఎస్సీ 01
ఎస్టీ 01
జనరల్ మహిళ 04
అన్రిజర్వ్డ్ 01
121 మున్సిపాలిటీలలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఇలా..
సామాజిక వర్గం కేటాయించిన వార్డులు మొత్తం వార్డుల్లో శాతం
బీసీలు 763 28.21 %
ఎస్సీలు 400 14.79 %
ఎస్టీలు 175 6.47 %
మహిళలు (జనరల్) 788 29.14 %
అన్ రిజర్వ్డ్ (జనరల్) 578 21.39 %
మొత్తం వార్డులు 2,704 100 %
కార్పొరేషన్
పేరు మొత్తం వార్డులు ఎస్టీలు ఎస్సీలు బీసీలు మహిళలు (జనరల్) అన్ రిజర్వ్డ్ (జనరల్)
భద్రాద్రి(కొత్తగూడెం) 60 11 12 7 16 14
ఖమ్మం 60 3 7 20 16 14
హనుమకొండ (వరంగల్) 66 2 11 20 17 16
నిజామాబాద్ 60 1 5 24 16 14
కరీంనగర్ 66 1 7 25 18 15
జీహెచ్ఎంసీ 300 5 23 122 76 74
పెద్దపల్లి (రామగుండం) 60 1 13 16 16 14
మంచిర్యాల 60 1 9 20 16 14
నల్గొండ 48 1 7 16 13 11
మహబూబ్‌నగర్ 60 1 3 26 16 14
మొత్తం 840 27 97 296 220 200
శాతం 100% 3.21% 11.55% 35.24% 26.19% 23.81%
