
- అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశం
హైదరాబాద్, వెలుగు: సిటీలో కాంప్రెహెన్సివ్ రోడ్డు మెయింటెనెన్స్ ప్రోగ్రాం (సీఆర్ఎంపీ) పనులపై దృష్టి పెట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జోనల్ అడిషనల్ కమిషనర్లతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ఆమె మాట్లాడారు. సీఆర్‌ఎంపీ ద్వారా చేపట్టిన రోడ్లకు సంబంధించిన ఏజెన్సీలతో చేసుకున్న అగ్రిమెంట్ డిసెంబర్ వరకు గడువు ఉన్నందున పెండింగ్‌లో ఉన్న మెయింటెనెన్స్ పనులు వెంటనే పూర్తి చేయించాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు.
ఏజేన్సీ ఒప్పందంలో ఉన్న అంశాలకు పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. అవసరమైతే ఏజెన్సీలతో జోనల్ స్థాయిలో సమీక్ష చేసి ఒప్పందం చేసుకున్న విధంగా ఏమైనా గ్యాప్ ఉంటే పనులు చేయించాలని తెలిపారు. అలాగే, డెంగ్యూ వ్యాధి నియంత్రణకు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మరింత ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. దోమలతో వచ్చే వ్యాధులతో పాటు ఈగల ద్వారా వచ్చే వ్యాధులపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కమ్యూనిటీ హాల్స్ వివరాలు సర్కిల్ వారీగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, లక్ష్యం మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.