పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలి..  జీహెచ్ఎంసీ కమిషనర్​ ఆదేశం

పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పకడ్బందీగా జరగాలి..  జీహెచ్ఎంసీ కమిషనర్​ ఆదేశం

హైదరాబాద్, వెలుగు: పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏఆర్ఓలకు పోస్టల్ బ్యాలెట్​పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. ఎన్నికల విధులపై దిశా నిర్దేశం చేశారు.

ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి మొదటి విడత శిక్షణ కార్యక్రమంలో ఫారం –-12 అందించి, పోస్టల్ బ్యాలెట్ పై పూర్తి అవగాహన కల్పించాలన్నారు. ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాజువల్ లీవ్ వెసులుబాటు కల్పించిందన్నారు. అనంతరం హైదరాబాద్ జిల్లా కలెక్టర్,  రిటర్నింగ్ ఆఫీసర్​అనుదీప్ పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్, అడిషనల్ కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే తదితరులు పాల్గొన్నారు.

అలాగే జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో టీఎల్ఎఫ్, ఎస్ఎల్ఎఫ్ లీడర్లు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగుల అసోసియేషన్ ప్రతినిధులు, థర్డ్ జెండర్, ట్రాన్స్ జెండర్స్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల మహిళా ప్రతినిధులతో కమిషర్​గురువారం సమావేశం నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఏప్రిల్15 వరకు నమోదు చేసుకోవచ్చని సూచించారు.

ఏఏసీ ప్లాంట్​ పరిశీలన

హైదర్​గూడలోని మ్యాపిల్ టౌన్ విల్లాస్ లో ఎండిన ఆకులతో ఆర్గానిక్ ఎరువులను తయారు చేసే యాక్సిలరేటెడ్ ఎనరోబిక్ కంపోస్టింగ్(ఏఏసీ) ప్లాంట్ ను గురువారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సందర్శించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైదరాబాద్ వారు ఈ టెక్నాలజీ ని అభివృద్ధి చేశారు. కమిషనర్ తోపాటు అడిషనల్ కమిషనర్ శివకుమార్ నాయుడు, డాక్టర్ సునంద రాణి, జోనల్ కమిషనర్ స్నేహశబరీశ్ తదితరులు పాల్గొన్నారు.