జీహెచ్ఎంసీ కౌన్సిల్ లో రచ్చ రచ్చ జరిగింది. వందేమాతరం, జయ జయహే తెలంగాణ గీతాల ఆలాపన సమయంలో కొందరు మజ్లిస్ కార్పొరేటర్లు కుర్చీలో నుంచి లేవలేదు. దీంతో బీజేపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఉండాలంటే వందేమాతరం గీతం పడాల్సిందేనని నినాదాలు చేశారు. దీంతో బీజేపీ కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ఎంఐఎం కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు.
బీజేపీ, మజ్లిస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వివాదం జరిగింది. ఇరు పార్టీల సభ్యులు టేబుల్స్ ఎక్కి నానా హంగామా చేశారు. దీంతో మార్షల్స్ వచ్చి సభ నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే సభ జరిగేలా సహకరించాలని కాంగ్రెస్ సభ్యులు కోరారు. బీజేపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతకు ముందు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి ముందే హాల్లో గందరగోళం నెలకొంది. జీహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశంలోకి మార్షల్ వచ్చారు. బీఆర్ఎస్ సభ్యుల దగ్గర ఉన్న ఫ్లకార్డులను మార్షల్స్ లాక్కెళ్లారు. దీంతో బీఆర్ఎస్ కార్పోరేటర్లు ఆందోళనకు దిగారు. మార్షల్స్ హాల్ లోపటికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ప్రారంభం అవ్వడానికి ముందే మార్షల్స్ హాల్ లోకి ఎలా వస్తారని ప్రశ్నించారు కార్పొరేటర్లు.
